Weather Latest Update: హోలీకి ముందు షాక్! ఇక్కడ వడగళ్లవాన పడే ఛాన్స్ - ఐఎండీ వెల్లడి
వెస్టర్న్ డిస్ట్రబెన్స్ మార్చి 7 నుండి వాయువ్య, పశ్చిమ, మధ్య భారత ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
హోలీకి ముందు ఒక్కసారి ఉత్తర భారత వాతావరణంలో పెను మార్పు కనిపిస్తుంది. వేసవి కాలం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మళ్లీ పలు రాష్ట్రాల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో పాటు కొండ ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. మార్చి 5 నుండి మార్చి 8 వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
వెస్టర్న్ డిస్ట్రబెన్స్ మార్చి 7 నుండి వాయువ్య, పశ్చిమ, మధ్య భారత ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో పశ్చిమ రాజస్థాన్‌లో ఆదివారం (మార్చి 5) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి 8 వరకు తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్రల్లో ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ హరియాణా, పశ్చిమ రాజస్థాన్‌లో తేలికపాటి లేదా ఓ మోస్తరు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 8 వరకు తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్రల్లో ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతకు సంబంధించి, IMD ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఉండదని, అయితే ఆ తర్వాత ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ తగ్గవచ్చు.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది. నిన్న మొన్నటి వరకూ కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ఉండేది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.1 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.