Weather Latest Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్- నేడూ ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
నేడు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఈ రోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ది ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంగి ఉందని చెప్పారు.
షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి. నేడు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 97 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాల వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని విపత్తుల సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం ఉండాలని సూచించారు. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 అని వివరించారు. జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.
‘‘దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ - నాగర్ కర్నూలు మీదుగా దూసుకొస్తున్న వర్షాలు నేరుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. నేడు రాత్రి మొత్తం, అలాగే రేపు ఉదయం వరకు కర్నూలు, నంధ్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలను మనం చూడగలము’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.