Weather Latest Update: అల్పపీడనం ఎఫెక్ట్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఈ జిల్లాల్లోనే
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నిన్నటి అల్పపీడనం ఈ రోజు ఉత్తర ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 19) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వాలి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 19 రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అల్పపీడనం సాయంత్రానికి ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఈ అల్పపీడనం తెలంగాణ రాష్ట్రం నుండి దూరంగా వెళ్లిపోయిందని తెలిపారు.
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆదిలాబాద్, కొమరంభీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 88 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలుంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విశాఖ నగరంలోని శివారు ప్రాంతాల్లో నేడు వర్షాలకు అనుకూలంగా ఉందని.. కానీ రేపు వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అలాగే మధ్య ఆంధ్ర జిల్లాలైన ఉభయ గోదావరి, ఎన్.టీ.ఆర్., కృష్ణా, ఏలూరు, కొనసీమ, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు ఉంటాయని అంచనా వేశారు. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కోస్తా భాగాల్లో వర్షాలు పరిమితం కానున్నాయి. అలాగే రేపు ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలుంటాయని అంచనా వేశారు.