Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూన్ 10) ఓ ప్రకటనలో తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ లోని మిగిలిన భాగాలు మరియు కర్ణాటకలోని కొన్ని భాగాలకు వ్యాపించాయని తెలిపారు. తెలంగాణలో దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం , మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మరియు రేపు అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 60 శాతంగా నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.
‘‘మంచి వేడి, తమిళనాడులో కొనసాగుతున్న రుతుపవనాలు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అకాల వర్షాలను పెంచుతోంది. నేడు అర్ధరాత్రి వరకు తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాల్లో విస్తారంగా వర్షాలను మనం చూడగలము. పిడుగులు, ఈదురుగాలులతో ఈ వర్షాలు ఉంటాయి. మరో వైపున తెలంగాణలో కొనసాగుతున్న అకాల వర్షాలు ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు భాగాలైన కర్నూలు, పల్నాడు జిల్లాల్లోకి అర్ధరాత్రి లోపల ప్రవేశించనున్నాయి. గుంటూరు జిల్లాలోని పలు భాగాలు, పల్నాడు జిల్లాలోని తూర్పు భాగాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న భారీ వర్షాల వలన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మరో రెండు గంటల వ్యవధిలో వర్షాలు పల్నాడుతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బాపట్ల జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా కురవనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.