Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ , రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నేడు దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసరాల్లోని ఒడిశాలో ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (జూన్ 9) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ , రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు మరియు ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం) కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.( ఖమ్మం నల్గొండ, సూర్యపేట , కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62 శాతంగా నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
‘‘నేడు తేమగాలులు బాగా ఉండటం వలన మధ్యాహ్నం వరకు ఉపసమనం లభించే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ భాగాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది. అలాగే విశాఖ నగరం పరిసరాల్లో కొన్ని తేలికపాటి వర్షాలు, చల్లటి గాలులు విస్తరిస్తున్నాయి. దీని వలన వైజాగ్ లో నేడు మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతం అయ్యి ఉండనుంది. మరోవైపు నగరంలోని పలు భాగాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, అనంతపురం, నంధ్యాల జిల్లాల్లో చల్లటి వాతావరణం, మేఘావృతమైన ఆకాశం ఉంది. ఇది అలాగే మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం కొనసాగుతోంది.
నేడు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాయంకాలం, రాత్రి సమయాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడ అక్కడక్కడ వర్షాలను చూడగలం. అది కూడ చాలా తక్కువ చోట్లల్లో కురుస్తాయి.
రుతుపవనాలు కేరళని తాకి అక్కడే స్ధిరంగా ఉన్నాయి. దాని వలన నేడు అకాల వర్షాలు కొనసాగనున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్, బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగడం వలన రుతుపవనాలు ఆలస్యంగా ముందుకు కదులుతోంది. నేడు సాయంకాలం నుంచి రాత్రి మధ్యలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, అలాగే కోస్తాంధ్రలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని భాగాల్లో మాత్రమే వర్షాలు కొనసాగనుంది. రుతుపవనాలు నేడు తమిళనాడులోని పలు భాగాలకు విస్తరించనుంది, అలాగే రాయలసీమను జూన్ 17 న తాకనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.