Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఆగస్టు 10న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు.
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మంగళవారం (ఆగస్టు 10న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు.
ఆదివారం (ఆగస్టు 9న) రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 10న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Also Read: Gold-Silver Price: మరోసారి పతనమైన పసిడి ధరలు.. అదే దారిలో వెండి పయనం..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే, ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 13వ తేదీ తర్వాత వర్షాలు పడడం ఎక్కువవుతుందని అంచనా వేశారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయని వివరించారు.
Also Read: Petrol-Diesel Price, 10 August: నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే.. పలు నగరాలలో నిలకడగా ధరలు