Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
హైదరాబాద్లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో ఈశాన్య, తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 77 శాతంగా నమోదైంది.
మెున్నటి వరకు తెలంగాణలో విపరీతమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టగా.. తాజాగా చలికాలం ప్రారంభమైంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకూ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నమోదు కాబోయే అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 31 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కానున్నట్లు అంచనా వేశారు.
ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
‘‘ఈశాన్య రుతుపవనాల తొలకరి వలన తిరుపతి, నెల్లూరు జిల్లాలల్లో ముఖ్యంగా, అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఒక ఉపరితల ఆవర్తనం తమిళనాడు మీదుగా అరేబియా సముద్రంలోనికి వెళ్లింది, దీని వలన దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు గత రెండు రోజులుగా పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు బ్రేక్ తీసుకోనుంది. నేడు బెంగళూరుకి దగ్గర ఉన్న కర్ణాటక సరిహద్దు ప్రాంతాల మీదుగా తేలికపాటి గాలుల సంగమం ఏర్పడింది. దీని వలన సరిహద్దు జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు మధ్యాహ్నం - సాయంకాలం సమయంలో కనిపిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని భాగాల్లో మాత్రమే వర్షాలు నేడు ఉంటాయి. నిన్నటిలాగా విస్తారంగా ఉండవు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.