Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ)తో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నిన్న ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు కూడా పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (మే 31) ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ)తో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 56 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
‘‘ఒడిశాలో మొదలైన వర్షాలు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోకి దూసుకొస్తున్నాయి. దీని వలన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నగరం - రణస్థలం పరిధిలో భారీ పిడుగులు, వర్షాలు నేరుగా జిల్లాలోకి విస్తరించనున్నాయి. కొన్ని చోట్లల్లో పిడుగులు విపరీతంగా ఉండనున్నాయి. అల్లూరిసీతారామరాజు జిల్లాలోని కొండ ప్రాంతాలు ముఖ్యంగా అరకు వ్యాలీ - పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు భాగల్లో వర్షాలు, తీవ్రమైన పిడుగులు విస్తరిస్తున్నాయి. మరోవైపున చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాల్లో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా సత్యసాయి జిల్లాలోని తూర్పు భాగాల్లోకి విస్తరించనున్నాయి. మరోవైపున తిరుపతి జిల్లాలోని సత్యవేడు వైపుగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా తమిళనాడు చెన్నై వైపుగా వెళ్లనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.