YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల
YS Sharmila : వర్ధన్నపేట ఎమ్మెల్యే గుట్టలు కూడా మాయం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కనీసం సొంత ఊరును పట్టించుకోలేదని విమర్శించారు.
YS Sharmila : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. పర్వతగిరి మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై తీవ్ర విమర్శించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సివిల్ కాంట్రాక్టర్ అంట, మొదట్లో సివిల్ కాంట్రాక్టర్ గా ఉన్న ఎమ్మెల్యే A1 కాంట్రాక్టరు అయ్యాడట అంటూ విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అడుగడుగునా భూ కబ్జాలు చేస్తు్న్నారని మండిపడ్డారు. అన్యాయం జరిగిందని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యే అరాచకాలు భరించలేక.. వర్ధన్నపేటలో సొంత పార్టీ కౌన్సిలర్లు ఎదురు తిరిగారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై పేపర్ వార్తలు వచ్చాయన్నారు. చివరికి గుట్టలు కూడా మాయం చేసినట్లు పేపర్ లోనే చదివానన్నారు.
బీరు సీసాలు అమ్ముకుని పంచాయతీ నడపాలంట
"ఇక స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సొంత ఊరు పర్వతగిరిని ఎప్పుడైనా పట్టించుకున్నారా?. డిగ్రీ కాలేజీ లేదు..కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు. 100 పడకల ఆసుపత్రి అన్నారు అదీ కట్టలేదు. పర్వతగిరి మండల కేంద్రంలో ఆసుపత్రి 24 గంటలు నడిపిస్తా అన్నారు అంట కదా. ఈయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఎక్కడైనా పంచాయతీలు అభివృద్ధి చెందాయా? సర్కారు నిధులు ఇవ్వదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా దక్కనివ్వరు. ఎర్రబెల్లి అంటారు ఖాళీగా ఉన్న బీరు సీసాలు, బ్రాందీ సీసాలు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలి అంట. బిల్లులు చెల్లించక రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తమని నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. ఇన్ని అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టినట్లు?. అప్పులు తెచ్చి కేసీఆర్ కుటుంబాన్ని..ఇలాంటి మంత్రులు,ఎమ్మెల్యే కుటుంబాలను బంగారం చేసుకున్నారు. రుణమాఫీ అని రైతులను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది." - వైఎస్ షర్మిల
ప్రజా ప్రస్థానం పాదయాత్ర 225వ రోజు నర్సంపేట్ నియోజకవర్గం చింత నెక్కొండ, సాయిరెడ్డిపల్లి, ఏబీ తాండా మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సాయంత్రం వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి గ్రామంలో మాట ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నా. pic.twitter.com/J9IPlfBQ2F
— YS Sharmila (@realyssharmila) February 3, 2023
8 వేల మంది రైతుల ఆత్మహత్యలు
రాష్ట్రంలో 16 లక్షల మంది రైతులను డీ ఫాల్టర్లుగా మార్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీ పథకాలు బంద్ చేశారన్నారు. వ్యవసాయం వైఎస్సార్ హయాంలో పండుగలా ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ పాలనలో దండగలా మారిందన్నారు. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పండుగ ఎలా అవుతుందని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కనీసం ఉద్యోగాలు కూడా లేవన్నారు. మూడు ఎకరాల భూమి లేదు, పోడు పట్టాలు లేవన్నారు.
ఇక కేసీఆర్ పాలన చాలని ప్రజలు అంటున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. YSR పథకాలను మళ్లీ బ్రహ్మడంగా అమలు చేస్తామని షర్మిల అన్నారు.