Warangal News: వరంగల్ లో ప్రశాంతంగా ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు
Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టయిఫండరీ పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్-ఇన్ స్పెక్టర్ల నియామకాల్లో భాగంగా గత 22 రోజులుగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ఈరోజుతో ముగిశాయి.
Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టయిఫండరీ పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్-ఇన్ స్పెక్టర్ల నియామకాల్లో భాగంగా గత 22 రోజులుగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ఈరోజుతో ముగిశాయి. గత నెల డిసెంబర్ 8వ తేది నుండి హన్మకొండలోని కాకీయ యూనివర్సిటీ మైదానంలో 22 రోజుల పాటు జరిగిన ఈ దేహదారుఢ్య పరీక్షల్లో 24,612 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశారు. 21 వేల 585 మంది (అంటే 88 శాతం) అభ్యర్థులు ఈ దేహదారుఢ్య పరీక్షలకు హజరయ్యారు. 12, 387 (57.3శాతం) మంది అభ్యర్థులు తుది వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో 4,784 మహిళా అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా, 4,458 మంది అభ్యర్థునులు ఈ పరీక్షలకు హజరయ్యారు. ఇందులో 3,283కి పైగా మహిళ అభ్యర్థునులు తుది పరీక్షకు అర్హత సాధించారు. ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమైన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలన పిదప బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థులను నిర్ధారించారు.
కమాండ్ కంట్రోల్ రూంకు సీసీ టీవీల అనుసంధానం..
అనంతరం అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. ఈ పోటీలో నియామక మండలి నిర్ధేశించిన సమయంలో పరుగును పూర్తి చేసిన అభ్యర్థులను ఎత్తు, లాంగ్ జంప్, షాట్ ఫుట్ కు తరలించారు. ఈ నియమాకాలను పూర్తిగా టెక్నాలజీ సాయంతో నిర్వహించడంతో పాటు పూర్తి పారదర్శకంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థులు తిరిగే ప్రదేశాల్లో పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. దీన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణపై పర్యవేక్షిస్తున్నారు. ఈ పరీక్షల సమయంలోనూ పోలీస్ కమిషనర్ పరీక్షలు జరిగిన తీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి అరోగ్య సమస్యలు తలెత్తినా.. తక్షణమే ప్రథమ చికిత్స అందించేందుకు మైదానంలో వైద్యలును, వైద్య బృందాన్ని నింతరం అందుబాటులో ఉంచారు.
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడంలో అధికారుల పనితీరు అభినందనీయం..
నేటితో ఈ దేహదారుఢ్య పరీక్షలు ముగియడంతో ఈ పరీక్షల్లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, వైద్య, పీఈటీలు, పరిపాలన విభాగం, టెక్నికల్ బృందాలతో పోలీస్ కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దేహదారుఢ్య పరీక్షలను ప్రశాంతంగా విజయవంతం చేసినందుకుగాను పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు ఇతర విభాగాల సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. అలాగే వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు విజయవంతం కావడంలో కీలకంగా నిలిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో అధికారుల పనితీరు అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమములో అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేష్, ఏఓ రామకృష్ణలుతో పాటు ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, వైద్యులు, పిఈటీలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.