Warangal News: రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే, చట్టాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!
భారత రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానమే. నిరక్షరాస్యత, పేదరికము, ప్రచార లోపము మొదలైన కారణాలతో చాలామంది మహిళలు తమ హక్కులు, చట్టాల గురించి తెలుసుకోవడం లేదన్నారు.
Hanumakonda District Women: వరంగల్ : భారత రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.కృష్ణమూర్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థలు నిర్వహించే ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ మరియు హనుమకొండ సంయుక్తంగా ఆశ వర్కర్లకు, అంగన్వాడి టీచర్లకు, సఖి, వన్ స్టాప్ సెంటర్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఇతర ఎన్జీవోలకు న్యాయ సేవా సదనం బిల్డింగ్లో మహిళా సాధికారత అంశంపై శిక్షణా కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి మరియు వరంగల్ జిల్లా ఇంఛార్జి ప్రధాన న్యాయమూర్తి వై.సత్యేంద్ర పాల్గొనడం జరిగింది.
మహిళలు చట్టాల గురించి తెలుసుకోవాలి
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ "భారత రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానమే. నిరక్షరాస్యత, పేదరికము, ప్రచార లోపము మొదలైన కారణాలతో చాలామంది మహిళలు తమ హక్కులు, చట్టాల గురించి, రాజ్యాంగం గురించి అవగాహన లేక చట్ట పరిధిలో ఎలా, ఎప్పుడు ఆశ్రయించాలో, చట్ట ఉల్లంఘన ద్వారా అన్యాయాలు జరిగితే చట్టబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు.
ఆర్థిక బలహీనత, సాంఘిక పరమైన, సంస్కృతి పరమైన, ఏ ఇతర కారణాల వల్ల కూడా మహిళలు అన్యాయానికి గురి కాకూడదనే ఉద్దేశంతోనే న్యాయ సేవాధికార సంస్థలు మహిళలను ఉద్దేశించి, న్యాయ విజ్ఞాన సదస్సులు జిల్లా, గ్రామీణ ప్రాంతాలలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి, మహిళలకు సంబంధించిన చట్టాలను వివరించడం జరుగుతుంది మరియు అందరికీ న్యాయం జరిగేలా సమాన అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు అవసరమైన న్యాయ సేవలను అందజేస్తున్నాయి.
అన్ని రంగాలలో పాల్గొనేలా చైతన్యం
జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్థలు సమన్వయంగా మహిళలను చైతన్య పరిచే దిశగా విజ్ఞాన సదస్సులను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళలను చైతన్య పరిచే దిశగా ముందుకు వెళ్లాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థలు రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను సూచించడం జరిగింది. మహిళల స్థితిగతులు బాగుపడితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతున్నారు. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కలలు, సంస్కృతి, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొనేలా చైతన్యం పొంది ఉండాలి అని తెలిపారు.
న్యాయమూర్తి వై.సత్యేంద్ర మాట్లాడుతూ.. ‘‘జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉద్దేశాలలో స్త్రీకి సమాన హక్కులు కల్పించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. సమాజంలోని బాలికలకు మరియు స్త్రీలకు వారి హక్కులు ఏమిటో, వాటిని ఎలా సాధించుకోవాలో, స్త్రీ సాధికారత ఎలా సాధించవచ్చునో తెలపడం కొరకు అవగాహన సదస్సులు నిర్వహించి, స్త్రీల రక్షణకు, వారు ఆర్థికంగా సామాజికంగా ముందుకు సాగడానికి, రాజ్యాంగం అందించిన చట్టాలను వారికి తెలియజెప్పి వారికి తోడుగా న్యాయసేవాధికార సంస్థలు ఉన్నాయి. న్యాయ సేవాధికార సంస్థలు మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు న్యాయపరంగా సహాయపడటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాయి’’ అని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జే.ఉపేందర్ రావు, రిసోర్స్ పర్సన్స్ గా న్యాయవాదులు, ఛీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.శ్రీకాంత్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్, వి.పద్మజ, డాక్టర్ కే.గోపికరాణి, రాజ్యాంగ పరంగా అందిన మహిళల హక్కులు, క్రిమినల్, లేబర్ లా విషయాలు, డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ 2005, యాసిడ్ అటాక్, డౌరీ డెత్స్, సెక్స్ వల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ 2013, మెటర్నిటీ బెనిఫిట్స్, మెటర్నిటీ రైట్స్, సమాన పనికి సమాన వేతనం (ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్), డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మొదలైన మహిళా చట్టాలు, ఇతర చట్టాలు, విషయాలను గురించి వివరించారు.