Warangal News: వరంగల్ కమిషనరేట్ లో మహిళా పోలీసులకు వేధింపులు!
Warangal News: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మహిళా పోలీసులు పై అధికారుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
Warangal News: పోలీస్ ఉద్యోగం అంటేనే కత్తి మీద సాములాంటిది. తీవ్రమైన పని ఒత్తిడికి తోడు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు కూడా తప్పవు మరి. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని రాణించడం అంత తేలికేం కాదు. అయినా కూడా ఎంతో మంది మహిళలు ధైర్యంగా పోలీస్ ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఇటు కుటుంబాన్ని, అటు ఉద్యోగాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. పురుషులతో సమానంగా నిలబడుతున్నప్పటికీ.. కొందరు అధికారుల వంకర చూపులు, పాడుబుద్ధితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు పని ఒత్తిడి, మరోవైపు లైంగిక వేధింపులతో మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లు సతమతం అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. బయటే కాదు చివరికి ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్‌లోనే మహిళా సిబ్బందికి భద్రత కరువైందని పలువురు అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగంలోకి కొత్తగా వచ్చారా అయితే తస్మాత్ జాగ్రత!
కొత్తగా పోలీస్ ఉద్యోగంలోకి వచ్చే మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్ల పట్ల పలువురు సీఐలు, ఎస్సైలు అమర్యాదగా ప్రవర్తించడం.. అనుచితంగా మాట్లాడటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధులు ముగించుకుని వెళ్లినప్పటికీ తరుచూ ఫోన్లు చేసి వంకరగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ మానుకోట జిల్లాలో ఓ ట్రైనీ మహిళా ఎస్సైని విధుల పేరుతో అర్ధరాత్రి ఓ ఎస్సై తన వాహనంలో తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు స్వయంగా బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. మరో పక్క తమ మాట వినని మహిళా సిబ్బందిపై కొందరు అధికారులు కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మహిళా సిబ్బంది తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో వారికి, బంధువులకు, మిత్రులకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. అయితే పోలీస్‌శాఖలో కూడా మహిళలకు భద్రత కరువవడంతో ఎప్పుడేం జరుగుతుందోన అని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
మార్పు రావాలి : మహిళా పోలీసులు
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న, మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారుల పట్ల వరంగల్ సీపీ రంగనాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలోనే గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్ వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై ఏ హరిప్రియ, సుబేదారి ఎస్సై పీ పున్నం చందర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్సైలు, సీఐలపై అనేక అవినీతి, వివాహేతర సంబంధాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అధికారులపై సీపీకి ఫిర్యాదులు సైతం అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీపీ రంగనాథ్.. వీటిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికారులపై కొరఢా ఝలిపిస్తూ, ప్రధానంగా మహిళా సిబ్బందికి భరోసా కల్పించడమే లక్ష్యంగా సీపీ రంగనాథ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిలో మార్పు వస్తుందన్న ఆశతో మహిళా పోలీసులు ఎదురు చూస్తున్నారు.