Warangal CP Ranganath: భూతగాదా కేసుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి: సీపీ ఏవీ రంగనాథ్
Warangal CP Ranganath: పోలీస్ స్టేషన్ కు వచ్చే భూ తగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తగు విచారణ జరిపించాలని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
Warangal CP Ranganath: పోలీస్ స్టేషన్ కు వచ్చే భూతగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్.. పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే కాకతీయ విశ్వవిధ్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో కూడా ఈ సమీక్షా సమావేశాన్ని జరిపారు. డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇన్ స్పెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2021 నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించాలని వివరించారు. అలాగే విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకవచ్చే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించ వద్దని, శాంతి భద్రతలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అభద్ర భావం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
గుడుంబా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు..
ముఖ్యంగా విజువల్ పోలీసుల్లో భాగంగా అధికారులు, సిబ్బంది కీలక సమయాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలని సీపీ ఏవీ రంగనాథ్ అధికారులకు తెలిపారు. అలాగే నేరస్థులను గుర్తించడంతోపాటు నేర నియంత్రణ కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్ల పై నిఘా పెట్టాలని చెప్పారు. వరంగల్ కమిషన్ పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తునే గుడుంబా తయారీకి అవసరమైన ముడి పదార్థాల అమ్మకాలు, రవాణా కూడా నియంత్రించాలని, మహిళలకు సంబంధించిన నేరాలపై వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. వ్యక్తిగత క్రమ శిక్షణతో ఉంటూ.. నిబద్దత పని చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. శాంతి భద్రతల అంశాలపై ప్రస్తావిస్తూ.. ఆస్తి దొంగతనం కేసులకు సంబంధించి అధికారులు ఇకపై జరిగిన పూర్తి ఆస్తి నష్టం వివరాలను కేసు వివరాల్లో పొందుపర్చాలని వివరించారు.
నేరాలకు పాల్పడిన వెంటనే రికార్డుపరంగా కేసుల నమోదు
దొంగతనాలకు పాల్పడిన నేరస్థులను త్వరగా గుర్తించాలని సీపీ అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ఏవరైనా నేరాలకు పాల్పడిన వెంటనే వారిపై రికార్డు పరంగా కేసులను నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో వారు ఎలాంటి నేరానికి పాల్పడినా పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేయడం సులభం అవుతుందని.. అలాగే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా, మార్ఫింగ్ చేసిన వాహన దారులపై చీటింగ్ కేసులు నమోదు చేయాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వాహన దారుల వాహనాలను సీజ్ చేసి మైనర్ డ్రైవర్లు, వాహన యజమానులపై చార్జ్ షీట్ వేయాలని, ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆటోలపై చెక్ రిపోర్టులను రాసి రోడ్డు రవాణా శాఖకు అప్పగించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు, యండీ భారీ కరుణాకర్, సీతారాం, మురళీధర్, అదనపు డీసీపీలు పుష్పా, వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.