AP Voters Death: తెలంగాణ నుంచి ఏపీకి పయనం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Telangana News: ఓటు వేసేందుకు సొంతూళ్లకు ఎంతో మంది వెళ్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరిన ఇద్దరు ఓటర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది.
Voters dies in Road Accident: వరంగల్: మే 13న ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. అందులోనూ ఈసారి వీకెండ్ కూడా తోడవ్వడంతో పెద్ద ఎత్తున ఓటర్లు హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాల నుంచి ఏపీకి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో విషాదం నెలకొంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వద్ద జనం మీదకు టిప్పర్ దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ బస్ స్టాప్ వద్ద కొందరు బస్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఇసుక లోడ్ తో ఉన్న టిప్పర్ బస్ కోసం నిలబడిన ప్రయాణికుల మీదకు దూసుకురావడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. ఓటు వేయడానికి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు
శుక్రవారం నుంచే ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఓటర్లు జిల్లాలకు తరలి వెళ్తున్నారు. సొంతూళ్లకు ఒక్కసారిగా నగరవాసులు క్యూ కట్టడంతో.. ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఓటింగ్ సందర్భంగా దాదాపు 2 వేల బస్సులు అధికంగా నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ బస్సుల్లో 500 ఎంజీబీఎస్ నుంచి, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు, ఎల్బీ నగర్ నుంచి 300, ఉప్పల్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపుతోంది. పోలింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇదే చాన్స్ అని ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెలింగ్ ఛార్జీలను మూడింతలు, నాలుగు రెట్లు పెంచేసి సామాన్యులపై బారం మోపుతున్నారు. కొన్నిచోట్ల బుక్ చేసుకున్న బస్సు ఒకటైతే ఏర్పాట్లు చేస్తున్న బస్సు మరొకటి అని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా సొంత వాహనాలలో ఏపీకి బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ సమయంలో ఎక్కువ రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యే పంతంగి టోల్ ప్లాజా వద్ద సైతం పోలింగ్ టైమ్ కావడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.