(Source: ECI/ABP News/ABP Majha)
MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం
MLA Redya Naik: సీఎం కేసీఆర్ ఆగస్టులోనే ఎన్నికలు ఉండొచ్చని చెప్పినట్లు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. బీజేపీ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
MLA Redya Naik: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్ అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆగస్టులోనే ఎన్నికలు ఉండొచ్చన్నారని వివరించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలకు సూచించినట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు.
"మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయిన పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కు పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్వహించి వారిచ్చిన సూచనలు.. వచ్చే సెప్టెంబర్ లోనే నోటిఫికేషన్ రావొచ్చు. ఇంకా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇక్కడ అధికారంలో ఉన్నం కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటరు వీళ్లు. అనే ఒక కపటం తోటి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆగస్టులోనే పెట్టినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఎన్నికల కోడ్ వస్తే ఏం చేయాలి. అందుకనే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలే. జాగ్రత్త పడాలే. అని కొన్ని సూచనలు చేసిర్రు. అందులో ముఖ్యమైనవి ఆత్మయ సమ్మేళనం. అంటే ఎమ్మెల్యేకు, పార్టీ పెద్దలకు కొంత గ్యాప్ ఉండొచ్చు. మీకూ ప్రజలకు గ్యాప్ ఉండొచ్చు. నాకు ప్రజలకు గ్యాప్ ఉండొచ్చు. మన పార్టీ వాళ్లే మనకు వ్యతిరేకంగా పని చేస్తూ ఉండవచ్చు. మనందర్నీ కూడా కుటుంబ సభ్యుల్లాగా పిలిపించుకొని వాళ్లకింత భోజనం పెట్టి పొద్దుందాకా ఏన్న లోటుపాట్లు ఉంటే మాట్లాడుకొని మనం ఈ కార్యక్రమం చేసుకుంటే మనకు వాళ్లకు దగ్గర సంబంధం ఏర్పాటైంది. సంబంధాలు పెరుగుతయ్. వాళ్ల మనుసులో ఉన్నటువంటి భావన దూరం అయితది. కాబట్టి మీరు తప్పక నిర్వహించడని చెప్పడం జరిగింది. మనం నిర్వహిస్తమో లేదో అని సతీష్ గారి లాంటి అనుభవం ఉన్న నాయకులను మనకు ఇచ్చారు. వారం రోజుల నుంచి ఆయన నన్ను అడుగుతనే ఉన్నరు. నేనొకటే చెప్పిన 28వ తేదీన పెట్టుకుందామని. మేం అన్ని కూడా చేస్తాం." - ఎమ్మెల్యే రెడ్యా నాయక్
ప్రజలకు చేరువయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలు
ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి.. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులు పూర్చి చేయాలని కేసీఆర్ అన్నారని రెడ్యా నాయక్ గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో నేతలు సమన్వయంతో పని చేయాలని తమకు కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని.. వారికి తాము చేరువ అయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. ఈ క్రమంలోనే తాము కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పార్టీలో ఉన్న వాళ్లందరినీ కలిసి, వారి సమస్యలు కూడా తీరుస్తున్నామన్నారు. పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.