(Source: ECI/ABP News/ABP Majha)
BRS ఎమ్మెల్యేలపై భూకబ్జా, అవినీతి కేసులు! - కేసీఆర్ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్
Telangana News: కడియం శ్రీహరి రాజకీయంగా సమాధి అయ్యారని, ఆయన మోసగాడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు.
Station Ghanpur MLA Kadiyam Srihari- వరంగల్: తనపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. బస్సు యాత్రలో భాగంగా వరంగల్ రోడ్డులో కేసీఆర్ తనను టార్గెట్ చేసి మాట్లాడారని.. తాను ఎవర్నీ మోసం చేయలేదని, అయితే వరంగల్ ప్రజలతో పాటు, యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ కడియం శ్రీహరి మండిపడ్డారు. కడియం శ్రీహరి మోసగాడు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కడియం ఘాటుగా స్పందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూకబ్జా, అవినీతి కేసులు
హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చేసిన వారిపై ఎన్నో రకాల అవినీతి కేసులు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేసిన వారిపై భూకబ్జా, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఅర్ వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశాడని, కాకతీయులు మాకు ఇచ్చిన వారసత్వాన్ని ముక్కలు ముక్కలు చేశారని కడియం మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దయనీయ పరిస్థితులను తీసుకువచ్చింది కేసీఆర్ అని కడియం శ్రీహరి అన్నారు. 3 నెలల్లో ఏదో అద్భుతం జరుగుతుందని కేసీఆర్ అంటున్నాడని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క సీటు కూడా గెలవకుంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మూతపడబోతుంది కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని.. బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ తనపై విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే పని చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద సరైన ఆధారాలు ఉన్నాయి కనుక అధికారులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని కడియం అన్నారు. కవిత వల్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగమయ్యాడని కడియం అన్నారు. కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ స్థానంలో ప్రజలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి అభ్యర్థిగా పెట్టాడని.. దాని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు.
నన్ను తిట్టడానికే రాజయ్యను వాడుతున్న కేసీఆర్!
కడియం శ్రీహరిని తిట్టడానికి రాజయ్యను ప్రత్యేకంగా కేసీఆర్ జీతానికి పెట్టుకున్నాడని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. తనకు శత్రువైనా, వరంగల్ బీఆర్ఎస్ టిక్కెట్ రాజయ్య లాంటి వాడికి ఇస్తేనే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బతికేదని కడియం అన్నారు. బీజేపీని గెలిపించదానికే కేసీఆర్ డమ్మీ అభ్యర్థిని పెట్టాడన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ కోసం 10 సార్లు కేసీఆర్ ను ప్రాధేయపడ్డానని చెప్పారు. వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు రింగ్ రోడ్డు లేదన్నారు. వరంగల్ అంటే కేసీఆర్ కు కోపం, వ్యతిరేకత అని ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారనే భయం కేసీఆర్‌కు ఉందని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు, విచారణకు రావాలని ఆదేశాలు