Revanth Reddy: ఆ మంత్రి గుడి మాన్యాలన్నీ మింగిండు. అత్యంత అవినీతిపరుడు - రేవంత్ రెడ్డి
Telangana Election 2023: వనపర్తి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేశారు.
Wanaparthy News: వనపర్తి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండని అని రాష్ట్రమంతా కోడై కూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆయన అత్యంత అవినీతి పరుడనే ముద్ర పడిందని అన్నారు. వనపర్తి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేశారు.
‘‘చిన్నారెడ్డి నాకు పెద్దన్నలాంటి వారు.. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో వనపర్తికి ఒక ప్రాముఖ్యత ఉంది. 1952లో సురవరం ప్రతాప్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 1959లో ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజి ప్రారంభించారు. నేను చదువుకుంది వనపర్తిలోనే.. నాకు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. నాడు ఉద్యమ సమయంలో ఏముండే.. ఇప్పుడు వందలాది ఎకరాలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫైర్
కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకుంటే వారి శిష్యుడు నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు. అభివృద్ధిలో ముందుండాల్సిన వనపర్తికి నిరంజన్ రెడ్డి చెడ్డపేరు తెచ్చారు. వనపర్తి ఎమ్మెల్యే అంటే అత్యంత అవినీతిపరుడనే ముద్ర పడింది. నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు అని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం కాదు. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి. పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా మీరు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటుండు. చింతమడకకు రోడ్డు వేసింది.. సిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజి కట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేది.
వారి కలలే నెరవేరాయి
తెలంగాణ వస్తే రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండవు అనుకున్నాం. తెలంగాణ వస్తే సింగరేణి, విద్యుత్ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని కలలు కన్నారు. దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం, పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత కలలు నెరవేరాయి తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు దోచుకుండు. పదేళ్లు కేసీఆర్ దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని దోచుకుంది. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది.
పంచె కట్టుకుని నిరంజన్ రెడ్డి తనకు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుకుంటుండు. లాల్చీ వేసుకున్న ప్రతీ వాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు. 2018 నుంచి 2021 వరకు 83వేల మందికి రైతుబీమా ఇచ్చామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు. మూడేళ్లలో 83వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న నరహంతక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కేసీఆర్ కాదా? రైతు ఆత్మహత్యలను ఆపేందుకే కాంగ్రెస్ రైతు భరోసా పథకం ప్రకటించింది’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.