Minister Errabelli: నష్టపరిహారం అందిస్తాం, ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తాం- రైతులకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
Minister Errabelli: ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
Minister Errabelli: అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యాన్ని కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలు, పంటల నష్టాలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. సోమవారం హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దెబ్బ తిన్న పంటల నష్టాలను వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. అలాగే కౌలు రైతులతో పాటు నష్ట పోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలన్నారు. రైతుల పంటలను ప్రభుత్వం పరంగా ఆఖరు గింజ వరకూ కొనుగోలు చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి, కాంటాల్లో కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సేకరించిన ధాన్యం రవాణాను సైతం వేగంగా చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. మక్కల కొనుగోలుకు కూడా ఏర్పాట్లు చేయాలని వివరించారు. సమీక్షా సమావేశంలో వర్ధన్నపేట, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సతీష్ బాబు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, వ్యవసాయ అధికారులు ఉషాదయాళ్, డి.ఆర్.డి.వో పిడిలు శ్రీనివాస్ కుమార్, సంపత్ రావు, అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాలతో పంటలన్నీ నీటిపాలు - ఆగమైతున్న అన్నదాతలు
వరంగల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ప్రధానంగా మక్కలు, వరి, మిర్చి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయలు, పండ్ల తోటలు, పసుపు తదితర పంటలూ దెబ్బ తిన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ జిల్లాలో చూసినా నేలకొరిగిన చేన్లు, రైతుల కళ్లలో నీళ్లే కనిపిస్తున్నాయి. మండలాల వారీగా అగ్రికల్చర్ ఆఫీసర్లు నష్టం అంచనా కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. రికాంలేని వానలు, ఈదురు గాలులు, వడగండ్ల బీభత్సంతో నష్ట తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది.ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, మూలుగు, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలో మామిడి పండ్లు నేల రాలాయి. ఎకరానికి రూ.25 వేల చొప్పున నాలుగు ఎకరాల్లో కౌలు పట్టి, మిర్చి పంట పెట్టగా... ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది రోగాల తోటి 15 నుంచి 20 క్వింటాళ్లే వచ్చినట్లు అన్నదాతలు చెబుతున్నారు. ఇక్కడ లేబర్ దొరక్కపోతే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి, వాళ్లకు తిండి పెట్టి, నివాసం ఏర్పాటు చేసి మిర్చి కోయించి ఆరబెట్టి.. మార్కెట్ కు తీస్కెళ్లేందుకు లోడ్ చేస్తుండగా.. వర్షం కురిసిందని ఓ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. పంట తడవకుండా ట్రాక్టర్ పై పైనుంచి టార్పాలిన్ కప్పినా కింది నుంచి నీళ్లు జేరి మిర్చి అంతా నీటి పాలైందని కన్నీరు పెట్టాడు. ప్రస్తుతం మిర్చి పంట క్వింటాలుకు రూ.20 వేల ధర పలుకుతోందని.. తడిసిన పంటను మరో వారం రోజులు ఆరబెట్టే సరికి కలర్ నల్లబడి రేటు తగ్గుతుందని వాపోతున్నాడు. ఆరుగాలం పడిన కష్టమంతా ఒక్క వానతోటి నీళ్లపాలైంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు.