Revanth Reddy: బీజేపీ, బీఅర్ఎస్ పొత్తు ఖరారు, కేసీఆర్ ఆ మాటలే సాక్ష్యం - సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాటలతో బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు స్పష్టమైపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
Warangal News: వరంగల్ జిల్లా పరకాల జన జాతర సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్, నరేంద్ర మోదీలపై మండిపడ్డారు. కేసీఆర్ ఆత్మ అమిత్ షాను ఆవహించిందని.. అందుకే తనపై ఢిల్లీలో కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. అమిత్ షా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ భవన్ కు పోలీసులను పంపారని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీల పక్షాన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్ లు కేసు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలు అండగా నిలబడితే ఢిల్లీ అయినా గుజరాత్ అయినా భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థలు అయిన ఈడీ, ఇన్కమ్ టాక్స్ లతో దాడులు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచేలా చేయబోదని అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల సైన్యాన్ని దింపినా తెలంగాణకు ఎట్లా వస్తారో చూస్తానని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. దేశంలో జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ అని.. కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అన్నారు. నిజాం విముక్తి నుంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అయిన కేసీఆర్ ను వదిలించుకున్నామన్నారు. ఓటర్లు చంద్రశేఖర్ రావు లాంటి పాము తోక, నడుముపై తొక్కారని.. అందుకే చిన్నగా పడగలేస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నామా నాగేశ్వరరావుకు మద్దతుగా కేసీఆర్ చేసిన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రంలో హంగ్ వస్తుందని నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారంటే దాని అర్థం ఏమిటని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు పార్టీల ఆలోచనలు, ఎన్నికల విధానం ఒక్కటేనని అన్నారు. ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పంపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలారా మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని అన్నారు.
పొత్తు క్లియర్
కేసీఆర్ మాటలతో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు స్పష్టమైపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుందని.. ఎన్నికల తర్వాత కేసీఆర్ తో పొత్తు పెట్టుకోబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే ఉందని అటు ఇటు ఎక్కుడు దిగుడే సరిపోతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
అంబేడ్కర్ సిద్ధాంతాలను అవలంబిస్తూ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టే అనేక మంది దళిత, గిరిజనులు ప్రజాప్రతినిధులు అయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని.. మాకు 400 సీట్లు ఇవ్వాలని కోరుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
సీతారాముల కళ్యాణం జరగక ముందే అక్షింతలు పంచి బీజేపీ హిందూధర్మాన్ని అవమానించింది. pic.twitter.com/jdjGq79iKG
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2024