Boddemma Festival 2025: బొడ్డెమ్మ, బతుకమ్మ వేడుకలు.. తెలంగాణ యువతుల ప్రకృతి పండుగలు షురూ
Boddemma 2025 | ప్రకృతితో బంధాన్ని తెలిపేలా తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఉంటాయి. అందులో ఆడపడుచులు జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగులు ఉన్నాయి.

Boddemma Festival in Telangana | తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఉత్సాహాన్ని, ఆప్యాయత, అనురాగాలకు ఈ రెండు పండుగలు ప్రత్యేకం. ఇవి మట్టి, పూలతో సంబంధం ఉన్న ప్రకృతి పండుగలు. తెలంగాణలో రేపటి నుండి ఆడపడుచుల సందడి బొడ్డెమ్మ పండుగతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 12న బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండు
గ జరుపుకొంటారు. ఈ మట్టి పూల పండుగ ముఖ్యంగా బాలికలకు సంబంధించినది. తొమ్మిది రోజులు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 నుండి 8 గంటల వరకు యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిని కలగల్పుకొని ఆటపాటలతో తొమ్మిది రోజులు ఆడుకుంటారు. తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు.
బొడ్డెమ్మ ఒక ఆనవాయితీ..
యువతులు, మహిళలు అందరూ బొడ్డెమ్మ వద్ద అడుకున్నా. బొడ్డెమ్మ ను కాలనీ లో లేదా గల్లి లో ఆనవాయితీ ప్రకారం మాత్రమే బొడ్డెమ్మను (వేస్తారు) రూపొందిస్తారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డెమ్మ ఆటపాటల్లో పాల్గొంటారు. ఆచారం ఉన్న కుటుంబాల్లో బాలికలతో దీన్నొక నోముగా పట్టిస్తారు. బాలికకు మూడు లేదా ఐదేండ్లప్పుడు ఈ నోమును పట్టించి యుక్తవయసు వచ్చేవరకు కొనసాగిస్తారు. అమ్మాయికి పెళ్లి కావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవిని అర్చించే నోము ఇది. బొట్టె, బొడ్డె అంటే చిన్న అని. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకొంటారు.

రూపొందించే విధానం..
బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్ళి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు. ఆపైన ఒక చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టీ బియ్యం పోస్తారు. ప్రతి రోజు అనగా తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు అమ్మాయిలు, మహిళలు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి ప్రవేశిస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడతారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రకృతి, నిత్య జీవితంలో జరిగే సన్నివేశాలతో పాటలు
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్... బిడ్డాలెందారే కోల్... నా బిడ్డలేడుగురు కోల్... నీళ్ళల్లో పడ్డారూ కోల్... అంటూ పాడుకుంటారు. చిన్న చిన్న గుళ్ళు చిత్తారి గుళ్ళు... చూస్తూ చూస్తూ మా తాత సున్నమేయించాడు. నవ్వుతూ మా నాన్న నంది తెప్పించాడు అని ఇలా రకరకాల పాటలు పాడుతూ బొడ్డెమ్మను కొలుస్తారు.
ఆట ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ... నిద్రపోమ్మా. నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు. నిన్ను గన్నతల్లికి నిండునూరేండ్లు. అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు.

భావం ఒక్కటే.. రూపం వివిధ రకాలు..
పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో బొడ్డెమ్మను తయారుచేస్తారు. బొడ్డెమ్మను పీట పై రూపొందించిన కొందరు పందిరి వేయడం, కేవలం పీఠం పై రూపొందించిన ఇలా కొలిచిన భావం ఒక్కటే. తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరిరోజు ఉదయం గుంటల్లో పోసిన బియ్యంతో తొమ్మిది కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి ఆ రోజు గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి, ఆడుకున్న తరువాత చెరువులో పోయిరా బొడ్డెమ్మ... పోయిరావమ్మా అంటూ పాడుతూ నిమజ్జనం చేయడంతో బొడ్డెమ్మ వేడుకలు పూర్తవుతాయి.
మరుసటి రోజు నుంచి బతుకమ్మ వేడుకలు...
బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. ఇలా తెలంగాణలో సుమారు 25 రోజులు ఆడపడుచుల బొడ్డెమ్మ, బతుకమ్మ వేడుకల తో పాటు దసరా వేడుకలతో కోలాహలం, సందడి నెలకొంటుంది.





















