Aggalayya Gutta: వరంగల్‌లో 1000 ఏళ్ల పర్యాటక కేంద్రం అగ్గలయ్య గుట్ట, ఆ పేరెలా వచ్చిందంటే!
Aggalayya Gutta Jain Temple: హన్మకొండ పట్టణంలోని చారిత్రక ప్రదేశం అగ్గలయ్య గుట్ట. ప్రాచీన వైద్యుడు అగ్గలయ్య పేరు మీద అగ్గలయ్య గుట్ట అంటారు. తెలంగాణలో ప్రాచీన, మధ్య యుగ చరిత్రల్లో జైన క్షేత్రం.
![Aggalayya Gutta: వరంగల్‌లో 1000 ఏళ్ల పర్యాటక కేంద్రం అగ్గలయ్య గుట్ట, ఆ పేరెలా వచ్చిందంటే! Aggalayya Gutta Jain Temple Aggalayya Gutta Tourism Spot In Warangal Aggalayya Gutta: వరంగల్‌లో 1000 ఏళ్ల పర్యాటక కేంద్రం అగ్గలయ్య గుట్ట, ఆ పేరెలా వచ్చిందంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/9337e5931aa7f752d765683c84cc6a591716054616147233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aggalayya Gutta Tourism Spot In Warangal: కళలకు, చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు ఓరుగల్లు. రాజులు, రాజ్యాలు పోయిన వారి పాలనకు, ప్రజాసేవకు కట్టడాలు, ప్రదేశాలు నిదర్శనంగా నిలుస్తుంది వరంగల్. భావితరాలకు వారి చరిత్రను అందిస్తూ పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. కాకతీయుల చారిత్రక ఆధారాలు, కట్టడాలకు సమానంగా జైనుల దేవాలయాలు, సేవా కేంద్రాలు వరంగల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కనిపిస్తాయి. అలాంటిదే వరంగల్ లోని జైనుల ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచిన అగ్గలయ్య గుట్ట పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.
ఓరుగల్లులో జైనమత శోభ..
కాకతీయుల ముందు పాలకులు చాళుక్యులకు సామంత రాజులుగా కొనసాగి పాలించారు. దక్కన్ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో జైనులు ఎక్కువగా ప్రజాసేవ చేసినట్లు చరిత్ర చెబుతుంది. అందులో భాగంగానే తెలంగాణలోని వరంగల్ జైన కేంద్రంగా విరాజిల్లింది. హన్మకొండలోని పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్టలు జైన కేంద్రాలుగా కొనసాగాయి. జైనులకు సంబంధించిన అనేక రాతి చిత్రాలు ఈ రెండు గుట్టల వద్ద కనిపిస్తాయి. అగ్గలయ్య గుట్టపై 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుని 30 అడుగుల దిగంబర విగ్రహం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. అంతేకాకుండా ధ్యానముద్రలో ఉన్న జైనుడి మూడు అడుగుల విగ్రహం, ఆరు అడుగుల ఉన్న దిగాంబరుడి విగ్రహంతో పాటు గుట్టపై ఏడు జైన తీర్థంకరుల అర్థ శిల్పాలు ఉంటాయి. ఈ శిల్పాలను గుట్టకు చెక్కారు.
అగ్గలయ్య ఎవరు..
పశ్చిమ చాళుక్య రాజు జగదేకమల్లు జయసింహుడి మహారాజు వైద్యాచారుడే అగ్గలాచార్యుడు లేదా అగ్గల్లయ్య. వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన అగ్గలయ్య జయసింహుడి మహారాజు కు వైద్యం చేయడంతో పాటు ప్రజలకు, పశువులకు వైద్యం చేసేవాడు. జైన మతాచార్యుడిగా ఉన్న అగ్గలయ్య ప్రజలకు వైద్యం గుట్టపై చేసేవాడు. వైద్యం చేసినట్లు గుట్టపై ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. కాబట్టి అగ్గలయ్య గుట్టగా పేరు వచ్చింది. ఈ గుట్టపై జైన తీర్థంకరుడైన శాంతినాథుని విగ్రహానికి నిత్య పూజలు చేస్తారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుండి జైనులు వచ్చి అగ్గలయ్య గుట్టను సందర్శించి పూజలు చేసి వెళ్తారు. అంతేకాకుండా జైన గురువైన మహావీర్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతాయి.
పర్యటన కేంద్రంగా అగ్గలయ్య గుట్ట
జైన క్షేత్రంతోపాటు ప్రజావైద్య కేంద్రంగా ఉన్న అగ్గలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దారు. కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకంలో భాగంగా మంజూరైన 1 కోటి 50 లక్షల నిధులతో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. పర్యాటకులు గుట్టపైకి వెళ్ళడానికి గుట్టనే చెక్కి మెట్లు వేశారు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పచ్చని గార్డెన్, గుట్ట ప్రారంభంలో పౌంటెన్ ఏర్పాటు చేశారు. 20 రూపాయల ప్రవేశ రుసుముతో అగ్గలయ్య గుట్టను సందర్శించి వచ్చు. అగ్గలయ్య గుట్టకు వచ్చే పర్యాటకులు వంద, రెండు వందల మీటర్ల దూరంలోనే పద్మాక్షి దేవాలయం, పద్మాక్షి గుండం, సిద్దేశ్వరాలయం, సిద్దేశ్వర గుండం, కాలభైరవ క్షేత్రంను చూడవచ్చు.
పర్యాటక కేంద్రానికి మార్గాలు ఇవే
వివిధ ప్రాంతాల నుంచి బస్ మార్గాల్లో వచ్చే పర్యాటకులు హనుమకొండ బస్ స్టాండ్ లో దిగి కిలోమీటరు దూరంలో ఉన్న అగ్గలయ్య గుట్టకు ఆటో ద్వారా చేరుకోవచ్చు. హైదారాబాద్ రైలు మార్గంలో వచ్చే వారు కాజీపేట లో దిగి ట్యాక్సీ ద్వారా అగ్గలయ్య గుట్టకు చేరుకోవచ్చు. విజయవాడ రైలు మార్గంలో వచ్చేవారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి ట్యాక్సీ ద్వారా గుట్టకు చేరు కోవచ్చు. అగ్గలయ్య గుట్టకు సమీపంలోనే త్రి స్టార్, వన్ స్టార్ హోటల్స్ తో పాటు అనేక హోటల్స్, వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ అందుబాటులో ఉంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)