Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
Minister Errabelli : బండి సంజయ్, రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని మంత్రి ఎర్రబెల్లి సవాల్ చేశారు.
Minister Errabelli : TSPSC లీక్ లపై మాట్లాడుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు దమ్ముంటే, వాళ్లు చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గాలికి మాట్లాడి, బట్టలు కాల్చి మీద వేయడం సరికాదన్నారు. గుజరాత్ లో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారన్నారు. రాహుల్ కి ఒక నీతి, మీకు ఒక నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. మీరు ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలన్నారు. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు నోటికి వచ్చినట్లు మాట్లాడి, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఆయన... సరైన సమయంలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం
"TSPSC లీక్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలుతుంది. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని మరోసారి నిరూపించుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా పరిహారం 3,000 రూపాయలు కన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదల పక్షాన నిలబడింది. ఎకరానికి పరిహారం దేశంలో ఎక్కడ లేని విధంగా రూ.10,000 ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పంటలకు నష్టపరిహారం ఇస్తున్నారా? సమృద్ధిగా నీరు, 24 గంటల కరెంటు, పంటలు పెట్టుబడి, చివరకు పంటలు కొనుగోలు కూడా చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? దేశంలో రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? నల్ల చట్టాలను రద్దు చేయమని కోరిన రైతులను కాల్చి చంపిన దిక్కుమాలిన ప్రభుత్వం బీజేపీది. 700 మంది రైతులను పొట్టలు పెట్టుకున్న సర్కార్ అది." -మంత్రి ఎర్రబెల్లి
తగిన గుణపాఠం చెబుతారు
సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పెద్ద రైతుగా నిలబడి ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రైతులకు ఏ కష్టాలు వచ్చినా ఆదుకుంటున్నారన్నారు. దేశంలో ప్రజలంతా కేసీఆర్ కోసమే ఎదురుచూస్తున్నారని తెలిపారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ నినదిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు.
సిట్ రిమాండు రిపోర్టులో కీలక అంశాలివే!
TSPSC పేపర్ లీకేజ్ కేసులోని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులే. వీరితో కలిపి ఇప్పటివరకు నలుగురు TSPSC ఉద్యోగుల అరెస్ట్ అయ్యారు. వారిలో A1ప్రవీణ్ TSPSC సెక్రటరీ పీఏ, A2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్ : A10 షమీమ్ ASO, A12 రాజశేఖర్, డాటా ఎంట్రీ ఆపరేటర్.
ఓ హోటల్లో జరిగిన డీల్
19మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షిగా చేర్చారు. శంకర్ లక్ష్మి తో పాటు TSPSC , తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులను కూడా సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ యాజమని, అందులో ఉద్యోగిని కూడా సాక్షిగా చేర్చారు. హోటల్లోని సీసీటీవి కెమెరాలో పేపర్ మార్పిడి వ్యవహారం రికార్డయినట్టుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ ను ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.