Operation Polo: నిజాం రహస్య ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారు? ఆపరేషన్ పోలో వెనుక అసలు కథ!
భారత ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానం మధ్య ఒప్పందం జరిగింది. 1947 నవంబర్ 29న జరిగిన ఈ ఒప్పందానికే స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్ అని పేరు. ఈ ఒప్పందం పేరుకు తగ్గట్టే యథాతథ స్థితి (Status quo)ని కొనసాగించడం.

Standstill Agreement Led to Operation Polo | హైదరాబాద్: భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్ సంస్థానం ససేమిరా అంది. అయితే, 1948 సెప్టెంబర్ 18న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఇందుకు ప్రధాన కారణం, స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్‌ను హైదరాబాద్ పాలకుడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉల్లంఘించడమే. అయితే, ఈ అగ్రిమెంట్‌లో ఏముంది? నిజాం దాన్ని ఉల్లంఘించడానికి కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటి?
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలా సంస్థానాలు విలీనం అయ్యాయి. కానీ, నిజాం పాలకులు మాత్రం తమ సంస్థానం స్వతంత్రంగా ఉండాలని భావించారు. భారత ప్రభుత్వం ఒత్తిడి చేసినా, నిజాం విలీనానికి నిరాకరించారు. ఈ సందిగ్ధతను నివారించేందుకు, శాంతియుత చర్చల కోసం భారత ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానం మధ్య ఒక ఒప్పందం జరిగింది. 1947 నవంబర్ 29న జరిగిన ఈ ఒప్పందానికే స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్ అని పేరు.
ఈ ఒప్పందం పేరుకు తగ్గట్టే, యథాతథ స్థితి (Status quo)ని కొనసాగించడం. అంటే, బ్రిటిష్ పాలకులకు, సంస్థానాలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, పాలనలో అవి ఎలా కొనసాగాయో, అలాంటి సంబంధాలనే భారత ప్రభుత్వంతో కొనసాగించేలా ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున హోం సెక్రటరీ వి.పి. మీనన్ సంతకం చేయగా, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే, ఆయన తరపున నిజాం ప్రధాన మంత్రి నవాబ్ మొయిన్ నవాజ్ జంగ్ బహదూర్, సర్ వాల్టర్ మాంక్టన్ సంతకాలు చేశారు.
స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్‌లో ఏముంది?
ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటిష్ పాలనలో ఉన్న నాటి పరిస్థితులను యథాతథంగా అమలు చేయాల్సి ఉంది. అంటే, గతంలో సంస్థానాల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ బాధ్యతలు అమలు చేసిందో, అవే బాధ్యతలను భారత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ సంస్థానం కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగా భారత ప్రభుత్వ పాలనలో ఉండాల్సి ఉంది. అందులో ప్రధానమైనవి:
సైనిక రక్షణ: హైదరాబాద్ సంస్థానంపై బయట నుండి ఏదైనా దాడి జరిగితే, గతంలో బ్రిటిష్ సైన్యం ఎలా రక్షణ కల్పించేదో, అదే విధంగా భారత సైన్యం కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వానిదే అధికారం.
విదేశీ వ్యవహారాలు: బ్రిటిష్ పాలనలో హైదరాబాద్‌కు సంబంధించిన విదేశీ విధానం అంతా బ్రిటిష్ పాలకులే చూసుకునేవారు. స్వతంత్రంగా ఆయా దేశాలతో సంబంధాలు నెరపడం, ఒప్పందాలు చేసుకోవడం నిషిద్ధం. స్టాండ్‌స్టిల్ ఒప్పందంలో కూడా విదేశీ వ్యవహారాలన్నీ భారత ప్రభుత్వమే చూసుకుంటుంది. హైదరాబాద్ సంస్థానం ఎలాంటి విదేశీ వ్యవహారాలు స్వతంత్రంగా నిర్వహించకూడదు.
కమ్యూనికేషన్, రవాణా బాధ్యతలు: గతంలో బ్రిటిష్ ఇండియాలో ఎలా రైల్వే, పోస్టల్, టెలిగ్రాఫ్ వంటి వ్యవస్థలను బ్రిటిష్ పాలకులు నిర్వహించారో, అదే రీతిలో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలోనూ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
నిజాం ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించారు?
ఈ ఒప్పందానికి విరుద్ధంగా నిజాం ప్రభుత్వం తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. అలాగే, రజాకార్ల హింసను నిలువరించడంలో విఫలమైంది. ఈ ఉల్లంఘనల కారణంగా ఈ ఒప్పందం విఫలమై, చివరికి ఆపరేషన్ పోలోకు దారితీసింది. ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమై, ఐదు రోజుల సైనిక చర్య తర్వాత, నిజాం లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్ 18న ముగిసింది. ఇలా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.






















