Uttam Kumar Reddy: కాళేశ్వరం లోపాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం: మంత్రి ఉత్తమ్
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.
Uttam Kumar Reddy Review Meeting: హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Project) తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. హైదరాబాద్ లో జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని అధికారులతో చర్చించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అంటే జూన్ నాటికి కొత్తగా 50 వేల ఎకరాలకు నీరందించాలని అదేశించారు.
గత ప్రభుత్వం అప్పులు అధికం
ఏడాది చివరి (డిసెంబర్)కి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇతర శాఖలతో పాటు నీటిపారుదల శాఖలోనూ భారీగా అప్పులు చేసిందన్నారు. ఖర్చులు చేసినా, అప్పులు తెచ్చినా అందుకు తగ్గట్లుగా రైతులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. తమ ప్రభుత్వం అవసరం మేరకే ఖర్చులు చేస్తుందని, చేసిన ప్రతి రూపాయికి విలువ ఉండేలా పనులు చేస్తామన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలపై ఇదివరకే విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఎప్పటివరకూ నిర్మాణం పూర్తవుతాయని అధికారులతో చర్చించారు. ఏయే ప్రాజెక్టు ద్వారా ఎంతమేర సాగు జరుగుతుంది, మరిన్ని ఎకరాలకు నీరు అందించే అవకాశాలపై చర్చ జరిగింది. కొత్త ఆయకట్టు వివరాలపై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ & డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్‌లతో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.