TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?
TS News Developments Today: షర్మిల హడావుడి, మరోవైపు కేసుల విచారణ ఇలా తెలంగాణలో ఇవాళ చర్చకు రానున్న ముఖ్యమైన అంశాలు ఇవే
TS News Developments Today:
నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
నెల 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి వారం రోజుల పాటు తెలంగాణ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీ అంజనీ కుమార్ తెలిపారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ‘‘అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ అనే నినాదంతో ఈ కరపత్రాలను రూపొందించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో వీటిని అంటించి ప్రజల్ని చైతన్యవంతం చేయనున్నామని డీజీ పేర్కొన్నారు. అవినీతి అధికారుల సమాచారాన్ని టోల్‌ఫ్రీ నెంబరు 1064 లేదా వాట్సాప్ నెంబరు 9440446106 ద్వారా తమకు అందించాలని సూచించారు.
నేడు కేఆర్‌ఎంబీ రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) చివరి సమావేశం
ఉదయం 11 గంటలకు జలసౌధలో జరిగే సమావేశానికి సభ్యులు హాజరు కావాలని కన్వీనర్ రవికుమార్ పిళ్లై ఇప్పటికే బోర్డు నుంచి లేఖలు రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (రూల్ కర్వ్స్), పవర్ జనరేషన్, ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కింపుపై వివాదాలు పరిష్కరించేందుకు ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు. జూన్‌లో జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ డుమ్మా కొట్టింది. ఆ తర్వాత జరిగిన మరో రెండు సమావేశాలకు అటెండ్ అయినా తెలంగాణ అభిప్రాయాలకు ఆర్‌ఎంసీ రికమండేషన్స్‌లో చోటు దక్కలేదు. ఐదో సమావేశం నిర్వహణకు బోర్డు పలుమార్లు తేదీలు నిర్ణయించినా అటెండ్ అయ్యేందుకు తెలంగాణ ససేమిరా అన్నది. పలు కారణాలతో ఏపీ సైతం కొన్నిసార్లు రాలేమని చెప్పింది. దీంతో బోర్డు ఐదో సమావేశం నిర్వహించి మీటింగ్‌కు రెండు రాష్ట్రాల సభ్యులెవరూ హాజరుకాలేదని కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇచ్చింది. ఆర్‌ఎంసీ ఆరో (చివరి) సమావేశానికి 2 రాష్ట్రాల సభ్యులు హాజరుకాకుంటే ఆర్‌ఎంసీ ఫెయిలైట్టుగానే భావించాల్సి వస్తుందని, అందుకే సభ్యులంతా చివరి మీటింగ్‌కు రావాలని కొన్ని రోజుల క్రితం కన్వీనర్ లేఖలు రాశారు.
ఏఐజీ ఆసుపత్రిలో సదస్సును ప్రారంభించనున్న కేటిఆర్.
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఉమెన్ ఇన్ మెడిసన్ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో మున్సిపల్, ఐటి శాఖామంత్రి కేటిఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో మహిళలు - నాయకత్వ మార్గదర్శకత్వం, పని - జీవిత సంతులనం: భౌతిక మరియు లోహ శ్రేయస్సు. మహిళల కోసం నాన్-ఆథోడాక్స్ మెడికల్ స్పెషాలిటీస్. మెడిసిన్‌లో మహిళలకు సోషల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అంశాలపై చర్చించనున్నారు.
నేడు హైదరాబాదులో ప్రాపర్టీ ఎక్స్ పో ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.
హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ట్ నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం ప్రారంభిస్తారు. రెండు రోజులు పాటు హైదరాబాదులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఎక్స్పోలో పాల్గొంటాయి.
నేడు గన్ పార్క్ కు వైఎస్ షర్మిల.
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఈ రోజు హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ను కొనసాగించనున్నారు.
గుండె ఊపిరితిత్తుల మార్పిడి వైద్యనిపుల సొసైటీ ఒక సదస్సు హైదరాబాదులో నేడు నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది.
తెలంగాణ లో పెరగనున్న చలి తీవ్రత
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 4న తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 5న నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది డిసెంబర్ 7వ తేదీ ఉదయం నాటికి పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయాన్నే దట్టమైన పొగ మంచు కట్టేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రాబోయే ఐదురోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై దక్షిణం నుంచి తూర్పు దిశగా వేగంగా గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా ఉండే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.