Kishan Reddy: ఆపరేషన్ సిందూర్‌పై పిచ్చి మాటలు మాట్లాడొద్దు- రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కిషన్ రెడ్డి వార్నింగ్
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఎంతో విజయం సాధిస్తే సైన్యాన్ని అవమానించేలా మాట్లాడటం తగదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కిషన్ రెడ్డి హితవు పలికారు.

హైదరాబాద్: పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడంతో పాటు సరిహద్దుల్లో దాడులకు దిగిన పాక్ ఆర్మీకి సైతం భారత బలగాలు బుద్ధి చెప్పాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఎప్పుడు యుద్ధాలు వచ్చినా అన్ని రాజకీయ పార్టీలు, కులాలు మతాలు పక్కన పెట్టి సైనికులకు అండగా నిలవాలి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా దేశమంతా సైనికులకు అండగా నిలిచారు. కానీ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఓ వితంత వాదానికి తెరతీశారంటూ ఎద్దేవా చేశారు.
ఆ విషయాలు అడిగింటే ప్రజలు, సైన్యం సంతోషించేవాళ్లు
రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ సైనికులను అవమానించేలా మాట్లాడుతున్నారు. భారత్ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారని, పాకిస్తాన్ పై మన సైనికులు ఎలా విరుచుకుపడ్డారో అడిగి ఉంటే దేశ ప్రజలు, సైనికులు సంతోష పడేవారన్నారు. వీటికి బదులుగా పాక్ దాడుల్లో ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్కచెప్పాలని కాంగ్రెస్ నేతలు అడగటం సిగ్గుచేటు అన్నారు.
దేశ రక్షణకు సంబంధించి, సున్నితమైన అంశాలపై ఎలా మాట్లాడాలో తెలియని నేత ప్రతిపక్ష నేతగా ఉండటం దేశ ప్రజలు దురదృష్టం. ఢిల్లీలో బడేమియా రాహుల్ గాంధీ మాటలకు వత్తాసుగా.. హైదరాబాద్‌లో చోటేమియా రేవంత్ రెడ్డి.. కాపీ, పేస్ట్ ప్రశ్నలనే సంధించడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ నేతలు తమ ఇష్టరీతిన వ్యాఖ్యలతో సైనికుల శౌర్యం, పరాక్రమాన్ని, ధైర్యసాహసాలను, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడమేమన్న సోయి కూడా వారికి లేదు.
షెహబాజ్ షరీఫ్ సైతం అంగీకరించారు.
ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలు.. పాక్ ఆర్మీ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశాం. 23 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ విషయాలను ప్రపంచ మీడియాలో సైతం వచ్చింది. తమపై దాడి జరిగిన విషయాన్ని పాక్ ఆర్మీ, ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారు. వీడియో ఫుటేజీలతో సహా పాక్ లో జరిపిన దాడుల వీడియోలు రిలీజ్ చేశాం. రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు జరిపిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం అంగీకరించారు.
ఒకవైపు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ, మరోవైపు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రపంచ దేశాలకు తెలిపేందుకు మన ప్రతినిధులు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఆపేశాం. వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపేశాం. ప్రపంచం ఎదుట పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు మేం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని’ కిషన్ రెడ్డి మండిపడ్డారు.
రాహుల్ కు ప్రధాని అయ్యే అవకాశం లేదు
రాహుల్ గాంధీకి ఈ జన్మలో ప్రధాని అయ్యే అవకాశం లేదు. సైనికులకు అండగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తే వారికి బీజేపీ కార్యక్రమంలాగా కనిపించడం దుర్మార్గం. రాహుల్ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్లమంటూ రేవంత్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్ కు POKను కట్టబెట్టిందెవరో రేవంత్ కు తెలుసా? పీవోకేను కోల్పోయేలా చేసింది కాంగ్రెస్ కాదా..? 1971 యుద్ధంలో లాహోర్ వరకు సైన్యం చొచ్చుకుపోయినప్పుడు.. POKను తీసుకురాకుండా ఎవరు ఆపారు. స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నా.. 93 వేల మంది పాకిస్థాన్ సైనికులను విడిచిపెట్టారు.
- నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 2016లో పటాన్ కోట్ లో జరిగిన దాడికి సర్జికల్ స్ర్టైక్స్ పేరుతో పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మన సైన్యం దేశ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 2019లో బాలాకోట్ దాడికి దీటుగా పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి ఎయిర్ స్రైక్ చేసి ఉగ్రవాద శిబరాలు ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ కు నరకం చూపించాం వీటిలో ఏ ఒక్కటైనా చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని’ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.






















