TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు తొలగిన ఆటంకాలు, పరీక్ష వాయిదా పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
TSPSC Group 1 Prelims Exam Date: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ఇటీవల నిరాకరించింది. తాజాగా ఎగ్జామ్ రద్దు, వాయిదాపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
TSPSC Group 1 Prelims Exam Schedule: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ఇటీవల నిరాకరించింది. తాజాగా ఎగ్జామ్ రద్దు, వాయిదాపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దాంతో జూన్ 11వ తేదీన టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ఆటంకాలు తొలగిపోయాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను టీఎఎస్ పీఎస్సీ నిర్వహించనుంది. కాగా, ఈ ఎగ్జామ్ హాల్ టికెట్లను కమిషన్ ఇదివరకే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని ఎగ్జామ్ రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. మరోవైపు ఒక్కో పరీక్షకు మధ్య గ్యాప్ 45 రోజుల నుంచి రెండు నెలలు గడువు ఉండాలని దాఖలైన పిటిషన్లపై ఇదివరకే హైకోర్టు స్టే ఇచ్చింది.
రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్..
తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ గత ఏడాది విడుదలైంది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించారు. ఫలితాలు విడుదలైన తరువాత, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణకు సైతం కమిషన్ ఏర్పాట్లు చేసింది. కానీ అదే సమయంలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పలు ఎగ్జామ్ పేపర్లు ముందే లీకయ్యాయని గుర్తించారు. ఈ క్రమంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు డీఏఓ, ఏఈఈ, ఏఈ లాంటి మరికొన్ని ఎగ్జామ్ లను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను నిర్వహణకు ముందే వాయిదా వేసి, కొత్త పేపర్లతో ఎగ్జామ్ నిర్వహిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు.
గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించేందుకు టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ ఎగ్జామ్ సెంటర్ కు అనుమతించేది లేదని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రంలో మీ వివరాలు జాగ్రత్తగా నింపాలని, తప్పులు జరిగితే.. కొత్త ఓఎంఆర్ ఇచ్చేది లేదని అభ్యర్థులకు కమిషన్ అధికారులు సూచించారు.
అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది. పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది.