TS High Court : బీజేపీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణపై స్టే!
TS High Court : ఫామ్ హౌస్ బేరసారాల కేసులో బీజేపీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణపై నవంబర్ 4వ తేదీ వరకూ స్టే విధించింది.
TS High Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫామ్ హౌస్ కేసులో విచారణను నిలిపివేస్తూ స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ తరకు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణను నవంబర్ 4 వరకు వాయిదా వేసింది. పోలీసులు, టీఆర్‌ఎస్ నేతలు పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యేల ఎపిసోడ్ నడిపారని బీజేపీ తరఫు లాయర్లు వాదించారు. పోలీసుల విచారణపై నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసేవరకూ ఈ కేసు విచారణపై స్టే విధించింది. విచారణ సందర్భంగా బీజేపీ తరఫు లాయర్లు గట్టిగానే వాదనలు వినిపించారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధంలేదన్నారు. పోలీసులు బీజేపీకి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరో ముగ్గురిని తీసుకువచ్చి బీజేపీ వాళ్లంటూ ఆరోపిస్తున్నారని వాదించారు. ఈ ముగ్గురు తప్ప ఏ రూపంలోనూ బీజేపీ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. బీజేపీ తరఫు వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోయిన నిందితులు
ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. లేదు. ఆధారాల్లేవని, ఏసీబీ సెక్షన్లు వర్తించవని ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ...పోలీసుల రివిజన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది. నిందితుల్ని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకుని.. కస్టడీకి తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులు వివరాలు చెప్పడంలో విఫలమయ్యారని హైకోర్టు భావించింది. సీపీ ఎదుట నిందితులు లొంగిపోయిన తర్వాత వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టవచ్చని హైకోర్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోయారు.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో బీజేపీ ఎటువంటి సంబంధం లేదని యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇదంతా టీఆర్ఎస్ కుట్ర అని విమర్శించారు. కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. మంత్రి కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలన్నారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కరమవుతాయనుకుంటే దేశంలో కోర్టులు, పోలీసు స్టేషన్‌లు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. రేపిస్టులకు ఘన స్వాగతం పలిగిన బీజేపీ వాళ్ల ప్రమాణాలకు అసలు విలువ ఎక్కడ ఉందన్నారు. ఇలాంటి ప్రమాణాలతో నిజాలు మరుగన పడిపోవని అభిప్రాయపడ్డారు. అసలు బండి సంజయ్ ప్రమాణంతో యాదాద్రి అపవిత్రమైందని కామెంట్ చేశారు. గుజరాత్ గులాముల చెప్పుల మోసిన చేతులతో ప్రమాణం చేశారని ఎద్దేవా చేశారు. అలాంటి ప్రమాణాలకు అసలు విలువే లేదన్నారు. అపవిత్రమైన యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని అధికారులకు సూచించారు కేటీఆర్.