TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు
TS Govt : ఉపాధ్యాయుల ఆస్తుల ప్రకటనపై విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు.
TS Govt : టీచర్ల ఆస్తులు ఏటా ప్రకటించాలని తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యాశాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులు ఇవాళ వెలుగులోకి వచ్చాయి. ఈ ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉపాధ్యాయుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయులను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఏం జరిగింది?
నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల హెడ్ మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు గౌర్హజరు అవుతూ రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో పాల్గొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు జావేద్ అలీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. జావేద్ అలీపై చర్యలు తీసుకునే క్రమంలో పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్ విభాగం సూచించింది. సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఉండాలని కూడా పేర్కొంది. విద్యాశాఖ ఉద్యోగులు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర, చరాస్తి విక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ విభాగం సూచనలతో పాఠశాల విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ముందు ఇచ్చిన సర్క్యూలర్ లో ఏముంది?
ఏపీసీఎస్(1964) సర్వీస్ రూల్స్ 9లోని సబ్‌రూల్‌ను సర్క్యూలర్ లో గుర్తుచేశారు. ఉపాధ్యాయులు ఏటా ఆదాయం లెక్కలు చూపించాలని తెలిపారు. స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇండిపెండెంట్ ఇల్లు, ఫ్లాట్, షాప్, నివాసస్థలం, వ్యవసాయభూమి కొన్నా అమ్మినా అనుమతి తీసుకోవాలని సర్క్యూలర్ లో ఉంది. తన పేరుమీద లేక కుటుంబ సభ్యుల పేరు మీద కొన్నా వివరాలు తెలపాలని విద్యాశాఖ ఆదేశించింది. కొనడానికి ఆదాయం ఎలా వచ్చిందో లెక్కలు చూపాలని కోరింది. కారు, మోటార్‌సైకిల్, ఇతర వాహనం ఏది కొన్నా వివరాలు విద్యాశాఖకు అందించాలి. ఏసీ, టీవీ, వీసీఆర్, ఫ్రిజ్ ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏం తీసుకున్నా వివరాలు తెలిపారు. బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు, బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఇతర పెట్టుబడుల పూర్తి వివరాలు ఆస్తుల ప్రకటనలో తెలిపాలని విద్యాశాఖ తెలిపింది. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.