Telangana Election News: ముగిసిన నామినేషన్ల స్క్రూటినీ, జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ
Nominations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Telangana Elections 2023: తెలంగాణలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియలో కీలక వ్యక్తుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి నామినేషన్ కూడా ఉంది. ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తనయుడు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి నామినేషన్ వేశారు. అక్కడే జానారెడ్డి కూడా నామమాత్రపు నామినేషన్ వేయగా, అది తాజాగా తిరస్కరణకు గురైంది.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్ మానకొండూరులో కూడా ఏడుగురి నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేయగా.. వాటిలో 18 మంది అభ్యర్థుల నామినేషన్ లు మాత్రమే ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్‌లను అధికారులు రిజెక్ట్ చేశారు.
15 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఈ అన్ని నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) నేడు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించారు. నవంబరు నెల 15 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. ఈ లోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం వరకు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నామినేషన్ ఉపసంహరణ కూడా పూర్తి అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారనే సంఖ్య కచ్చితంగా తేలనుంది.
ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు చాలా మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. వివిధ పార్టీల నుంచి తమకు టికెట్ దక్కలేదనే కోపంతో కొంత మంది ఇండిపెండెంట్లుగా, రెబల్ గా కూడా నామినేషన్లు వేసిన వారు ఉన్నారు. ఆ ఓట్లు చీలకుండా ఆయా అభ్యర్థులు వారికి నచ్చజెప్పి, బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసే అవకాశం ఉంది.
ఎన్నికలు 30న
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఒకేరోజు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒకేరోజు వెల్లడించనున్నారు.