Bayyaram Steel Plant: బయ్యారం ఉక్కు పరిశ్రమ తెస్తే కిషన్ రెడ్డికి దండేసి దండం పెడతాం : ఎంపీ నామా నాగేశ్వరరావు
బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణపై బీజేపీ కక్ష సాధిస్తుందని, అభివృద్ధికి అడ్డుపడుతుందని ఆరోపించారు.
పార్లమెంట్(Parliament) సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswararao) ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్(Telangana Bhavan) మాట్లాడిన ఆయన... బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారన్నారు. జీవో 69ను 2009లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. 2010లో జీవో 64ను ఇచ్చిందన్నారు. బయ్యారంలో 40 నుంచి 60 శాతం ఐరెన్ ఉందని సర్వే నివేదికలు ఉన్నాయన్నారు. తెలంగాణ సంపద రాష్ట్రానికే దక్కాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణపై బీజేపీ(Bjp)కి కక్ష ఉందని కాబట్టే ఇక్కడి అభివృద్ధికి సహకారం ఇవ్వడం లేదన్నారు. పునరావాసం, రిసెటిల్మె్ంట్ కు దేశంలో ఎక్కడైనా కేంద్రమే డబ్బులు పెడుతోందని తెలంగాణకు వచ్చే సరికి ల్యాండ్ కాస్ట్ ఇవ్వాలని మెలిక పెడుతోందని ఆరోపించారు.
అర్ గల్ జల్ పథకానికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తూ తెలంగాణ(Telangana)కు ఎందుకు ఇవ్వడం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. బయ్యారం(Bayyaram) పరిశ్రమ తెచ్చి క్రెడిట్ కూడా మీరే తీసుకోవాలని కిషన్ రెడ్డిని కోరుతున్నానన్నారు. తెలంగాణకు బయ్యారం ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండం పెడతామన్నారు. తెలంగాణకు అన్యాయం చేయొద్దని నామా కోరారు. బయ్యారం ఉక్కు(Iron ore) అంశంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రాబోయే పార్లమెంట్ లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మైనింగ్ పై అధికారాలన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయని ఎంపీ అన్నారు. కేంద్రం దగ్గర ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్నారు. చట్టంలో మార్పులు తెచ్చి రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి(Singareni)లో రాష్ట్రం వాటా 51 శాతం ఉందని, మిగతా 49 కేంద్రం వాటా సైతం మేమే తీసుకుంటామని అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. మా భూభాగంలో మాకు హక్కు ఉంటుందని, హక్కును వదిలేసి బిడ్డింగ్ లో ఎందుకు పాల్గొనాలని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : మంత్రి పువ్వాడ అజయ్
సహాయమంత్రిగా ఉన్నప్పుడు నిస్సహాయకంగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్రమంత్రి కదా ఎందుకు రాష్ట్రం కోసం కొట్లాడటం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay kumar) ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని చెప్పింది కేంద్రమే అన్నారు. నాణ్యత లేనిది ఉక్కుకు కాదు ఉక్కు ఇవ్వడానికి కేంద్రానికి సంకల్పం లేదని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ రాదని కేంద్రం మాటనా? కిషన్ రెడ్డి సొంత కవిత్వం చెప్పారా? అని మంత్రి ప్రశ్నించారు. బయ్యారం ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రానికి సహకరిస్తామని చెప్పిందన్నారు. తెలంగాణ ఏర్పడం ప్రధానికి ఇష్టం లేనట్లు ఉందన్నారు. బయ్యారం ఉక్కు ఏర్పడడం ఇష్టం లేనట్లు కిషన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. ఫ్యాక్టరీ సాధ్యం కాకపోతే అక్కడి ప్రజల ఆగ్రహానికి గురికావడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.