Revant Reddy : కవితనూ సీవీ ఆనంద్ ప్రశ్నించాలి - ఎవరు సంప్రదించారో తేల్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ !
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కవితనూ విచారించాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ సుమోటోగా కేసు తీసుకోవాలన్నారు.
Revant Reddy : బీజేపీలో చేరేందుకు తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వయంగా అంగీకరించినందున.. ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సుమోటోగా తీసుకుని సిట్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత స్టేట్మెంట్ తీసుకుని.. ఆమెకు ఎవరు ఆఫర్ ఇచ్చారో విచారణ జరిపి తేల్చిచెప్పాలని అన్నారు. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలి. కవిత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ అధికారి సీవీ ఆనంద్ దర్యాప్తు చేయాలన్నారు. కవితను పార్టీలోకి రావాలని బీజేపీ ఆహ్వానించిందే తప్ప..కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లిందని రేవంత్ ప్రశ్నించారు.
ఒక సారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా ?
ఎమ్మెల్యేల కొనుగోళ్లుపై కేసీఆర్ నీతులు చెప్తున్నారని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా జాతిరత్నాలు అయ్యారని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మొదట తెరలేపిందే టీఆర్ఎస్ అని విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉందని.. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్ సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాజకీయాల్ని బీజేపీ, టీఆర్ఎస్ కలుషితం చేశాయన్న రేవంత్
రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. ఇందుకోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. వివాదాల ముసుగులో పాలకుల 8ఏళ్ల తప్పిదాలను తప్పిచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యాపార సంస్థలను వేధింపులకు గురి చేయలేదన్నారు. పార్టీలు మారిన వారిని వేధించలేదన్నారు. తమకు నచ్చనివారిని ఈ రెండు పార్టీలు తుదముట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కవిత ఏమన్నారంటే ?
భారతీయ జనత పార్టీ లో చేరాలని కవితపైనా ఒత్తిడి తెచ్చారంటూ పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని కవిత స్సప్టం చేశారు. ఎంపీ అర్వింద్ తాను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లుగా చేసిన ఆరోపణలపై స్పందించేందుకు ఆమె తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేని.. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. " షిండే మోడల్ " అంటే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే .. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో పాట తీసుకు పోయి.. తనదే శివసేన అని ప్రకటించుకున్నట్లుగా రాజకీయం మార్చడం. కవితను అలా షిండే తరహాలో రాజకీయం చేయాలన్న ఆఫర్ ఇచ్చినట్లుగా కవిత చెబుతున్నారు.