Telangana News : కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లనివా ? - ఇదిగో సర్కార్ క్లారిటీ
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. కొంత మంది గడువు తీరిన తర్వాత బ్యాంకులో వేయడం వల్ల సమస్య వచ్చిందన్నారు.
Telangana News : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్లో చాలా మంది చనిపోయారు. ఇలా ప్రాణాలర్పించిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 22 మే 2022 న 1010 చెక్కులను పంపిణీ చేశారు. అయితే ఆ చెక్కులు బౌన్స్ అవుతున్నాయని ఇప్పుడు కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విచారణ జరిపింది. అయితే అదంతా అవాస్తవమని వెల్లడయింది.
పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం
పంజాబ్ హర్యానా రైతులకు ఇచ్చిన చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఇదే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ చేయించిందని ఆయన తెలిపారు. కేసీఆర్ మొత్తం 1010 చెక్కులు పంపిణీ చేశారని అందులో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని తేలిందన్నారు. మిగతా వాటికి చెల్లింపులు జరగకపోవడానికి కూడా.. తెలంగాణ ప్రభుత్వం కారణం కాదని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.
చెక్కుల గడువు ముగిసిన తర్వాత కొంత మంది బ్యాంక్‌కు వెళ్లడంతోనే సమస్య వచ్చిందన్న ప్రభుత్వం
బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వుంటుంది. అట్లా చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు చేయక నిలిపివేయబడ్డాయని నిర్ధారణ అయ్యిందన్నారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. సంబంధిత బ్యాంకులకు గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసినారని చెప్తున్న మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగే విధంగా అనుమతివ్వాలనీ,..రీవాలిడేట్ చేయాలని ) ప్రభుత్వం ఇప్పటికే ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందని సోమేష్ కుమార్ తెలిపారు.
మరింత సహాయం కోసం రాంసింగ్ ఫోన్ నెంబర్ 9581992577 లో సంప్రదించాలని సూచన
పంజాబ్, హర్యానాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (రెవెన్యూ డిపార్ట్ మెంట్) రాంసింగ్ ను సంప్రదించవచ్చని సూచించింది. రాంసింగ్ ఫోన్ నెంబర్ 9581992577 ప్రభుత్వం ప్రకటించింది. అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మరోసారి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. వారికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం అందే దాకా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మరోసారి స్పష్టం చేస్తున్నామని సోమేష్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ- ఈడీ, ఐటీ దాడులతో బెదిరించలేరు - మంత్రి హరీశ్ రావు