TDP ORR Rally : ఓఆర్ఆర్ పై వెళ్లకుండా పోలీసుల కట్టడి - అయినా కొన్ని చోట్ల ర్యాలీ !
ఓఆర్అర్‌పై టీడీపీ సానుభూతిపరుల కార్ల ర్యాలీని పోలీసులు కట్టడి చేశారు. అప్పటికీ కొంత మంది ర్యాలీ నిర్వహించారు.
TDP ORR Rally : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐయామ్ విత్ బాబు అంటూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ సానుభూతిపరులు ఓఆర్ఆర్‌పై చేయాలనుకున్న ర్యాలీని పోలీసులు కట్టడి చేశారు. హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని ORR జంక్షన్ నుంచి కారు ర్యాలీ ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. ర్యాలీ కోసం వచ్చిన ఎవర్నీ ఔటర్ పైకి అనుమతించలేదు. ముందుగానే పోలీసులు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్నం నుంచి తనిఖీలు ప్రారంభించారు. నానక్ రామ్ గూడ ORR ఎంట్రీ వద్ద కార్లను ఆపి ర్యాలీ కోసం వచ్చే వారిని దారి మళ్లించారు. అప్పటికీ కొంత మంది ఓఆర్ఆర్‌పైకి వెళ్లి టీడీపీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
కార్లను అనుమతించకపోవడంతో పలువురు టీడీపీ సానుభూతిపరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబుకు మద్దతుగా నిర్వహిస్తున్న నిరసనలపై పూర్తి స్థాయిలో కట్టడి విదిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.. బుధవారం విప్రో జంక్షన్ లో నిర్వహించిన నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ఈ ర్యాలీని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. ఎవరు వస్తారులే అనుకుకున్నారు. కానీ వందల మంది రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అప్పటికప్పుడు అందర్నీ పంపించి వేశారు. కానీ అప్పట్నుంచి ఓ సారి మణికొండ.. మరో సారి కూకట్ పల్లి ఇలా జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం రోజు హైటెక్ సిటీ వద్ద నిరసన ప్రదర్శన చేయాలనుకున్నారు కానీ పోలీసులు కట్టడి చేశారు. పలువుర్ని అరెస్ట్ చేశారు.
శనివారం కార్యాలయాలకు సెలవులు కావడంతో ఓఆర్ఆర్‌పై నిరసన చేయాలనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్న కారణంతో ర్యాలీ కోసం ఎవరినీ అనుమతించలేదు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ నగరంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ముందు చూపు, దూర దృష్టి తో ఉమ్మడి ఎపిని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా అర్ద్రరాత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కు మద్దతుగా ఎపితో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లో నిరసనలు జరుగుతున్నాయి.
‘ఐటీ అంటే ఏమిటో అర్థం చెప్పిన నేత చంద్రబాబు.. ఆయన మార్గనిర్దేశంతోనే ఇక్కడివరకు రాగలిగాం. ప్రజాస్వామ్య విలువలు మచ్చుకైనా కనిపించని ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దార్శనికుడు, అభివృద్ధిని కాంక్షించే నేతను అక్రమంగా అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన్ని విడుదల చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని ర్యాలీలో పాల్గొన్న వరు చెబుతున్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ వారు నినాదాలు చేశారు.