(Source: ECI/ABP News/ABP Majha)
Thailand Casino Arrests : ధాయ్‌ల్యాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ - చీకోటి ప్రవీణ్ బ్యాచేనా ?
ధాయ్‌లాండ్‌లోని పట్టాయలో ఓ హోటల్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 83 మంది ఇండియన్స్‌ని అక్కడి పోలీసులు పట్టుకున్నారు. వీరంతా చీకోటి ప్రవీణ్ తరపున వచ్చి ఆడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.
Thailand Casino Arrests : ధాయ్ ల్యాండ్‌లోని పట్టాయలోని ఓ హోటల్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 83 మంది భారతీయుల్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది మహిళలుకూడా ఉన్నారు. అక్కడి మీడియా సంస్థ ద నేషన్ ధాయ్ ల్యాండ్ ఈ అరెస్టు వివరాలను ప్రకటించింది. మొత్తం 83 మంది హోటల్‌లో ఓ సెటప్ ఏర్పాటు చేసుకుని గ్యాంబ్లింగ్ ఆడుతున్న విషయంపై సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారని తెలిపింది. కొంత మంది పారిపోవడానికి ప్రయత్నించినా దొరికిపోయారని తెలిపింది. వీరికి సంబంధించిన ఫోటోలను కూడా ద నేషన్ ధాయిల్యాండ్ పత్రిక ప్రచురించింది.
ద నేషన్ ధాయిల్యాండ్ పత్రిక రిలీజ్ చేసిన ఫోటోల్లో ఉన్న వారంతా తెలుగు రాష్ట్రానికి చెందిన వారే. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా ఉన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడిన ఫోటోల్లో ఉన్నట్లగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అసలు నిర్వహకుడు చీకోటి ప్రవీణ్‌ను కూడా ధాయిల్యాండ్ పోలీసులు పట్టుకున్నారని అంటున్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
Chonburi police arrested 83 Indian tourists early on Monday for allegedly playing card games for money in a convention hall of a Pattaya hotel. https://t.co/PhUdI90Zyd
— The Nation Thailand (@Thenationth) May 1, 2023
చీకోటి ప్రవీణ్ ధాయ్ ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ సాయంతో ఈ కేసినోను అక్కడ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. భారత టూరిస్టులకు తాను ఇలాంటివి డబ్బులు తీసుకుని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. హోటల్‌లోని కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నామని.. అక్కడకు ఎవరినీ అనుమతించకుండా ఒక్క హోటల్ స్టాఫ్ కు మాత్రమే అనుమతించేలా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే.. కార్డులు, కార్డు డీలర్స్, గ్యాంబ్లింగ్ సామాగ్రి.. మొత్తం ఇండియా నుంచే వచ్చిందని తనకు సంబంధంలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చిన వారంతా రేయింబవళ్లు ఈ జూదం ఆడుతున్నట్లుగా పట్టాయ పోలీసులు ప్రకటించారు.
తాను విదేశాల్లో గ్యాంబ్లింగ్, కేసినోలు నిర్వహస్తానని చీకోటి ప్రవీణ్ బహిరంగంగానేప్రకటించారు. అయితే ధాయ్ ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ చట్టబద్దమేనని.. చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని వాదించేవారు. కానీ ఇప్పుడు పట్టాయలోనే చట్ట వ్యతిరేకమని పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. జైలుకు పంపడం సంచలనంగా మారింది. గ్యాంబ్లింగ్ కు మించి ఏదో చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండు మంది మహిళలు కూడా పట్టుబడటం.. అసలు వెళ్లిన వారు అంతా ఎవరు అన్నదానిపై చర్చజరుగుతోంది. వారందరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.