QR Code Current Bills: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి QR కోడ్, ఒక్క క్లిక్‌తో ఈజీగా బిల్ చెల్లించొచ్చు
TGSPDCL: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (TGSPDCL) విద్యుత్ చెల్లింపుల కోసం కొత్తగా క్యూఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. బిల్లు తీశాక దాని కింద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఇవ్వబోతోంది.
QR Code For Current Bill Payment: విద్యుత్ వినియోగదారులకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (TGSPDCL) గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపేసిన క్రమంలో.. క్యూఆర్ కోడ్ (QR Code) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఇంటి వద్ద విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద ఈ క్యూఆర్ కోడ్ ఇస్తారు. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్స్‌లో కోడ్ స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ QR కోడ్‌తో కూడిన బిల్లులు వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
పైలెట్ ప్రాజెక్టుగా..
TGSPDCL తొలుత పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల (ERO) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని డిస్కంల పరిధిలోని అన్ని జిల్లాల్లో దశలవారీగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్థ మొబైల్ యాప్, వెబ్ సైట్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ విధానం అమలైతే ఎలాంటి ఆటంకం లేకుండా మరింత ఈజీగా బిల్లులు చెల్లించొచ్చని చెప్పారు.
ఆర్బీఐ మార్గదర్శకాలతో..
కాగా, ఆర్బీఐ (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగా పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ బిల్లుల చెల్లింపులు నిలిపేశాయి. ఈ నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అన్నీ బిల్లుల చెల్లింపులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ క్రమంలో బిల్లర్లు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉండగా.. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు దీన్ని యాక్టివ్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు వినియోగదారుల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిపేశాయి.
అయితే, మారిన నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ యాప్స్‌లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నా.. ప్రస్తుతానికి బిల్లుల వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం సంస్థ వెబ్ సైట్, మొబైల్ App నుంచి Bill desk - PGI, Paytm - PG, TA Wallet, TG/AP Online, MeeSeva, T-Wallet, Bill desk (NACH) ద్వారా బిల్లులు చెల్లించొచ్చని స్పష్టం చేశారు. వినియోగదారులకు మరింత సౌకర్యం కలిగించే చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.