Hyderabad News: సిటీ బస్సులో మహిళకు ప్రసవం - లేడీ కండక్టర్ మానవత్వం, ప్రశంసిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Telangana News: ఆర్టీసీ సిటీ బస్సులో అకస్మాత్తుగా పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళకు లేడీ కండక్టర్ తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ప్రసవం చేశారు. వీరిని మంత్రి పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్ అభినందించారు.
RTC MD Sajjanar Tweet On Lady Conductor Helped To Pregnant In RTC Bus: ఓ లేడీ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధ పడుతోన్న ఓ మహిళకు ప్రసవం చేశారు. అదే బస్సులో తల్లీ బిడ్డలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ (Musheerabad) డిపోకు చెందిన కండక్టర్ సరోజ విధి నిర్వహణలో భాగంగా ఆరంఘర్ నుంచి ఆర్టీసీ బస్‌లో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ వస్తున్నారు. ఇదే సమయంలో ఓ గర్భిణీకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఇది గమనించిన కండక్టర్.. బస్సును పక్కన ఆపించి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమెకు బస్సులోనే ప్రసవం చేశారు. సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. అదే బస్సులో తల్లీబిడ్డలను సురక్షితంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సాయం చేసిన కండక్టర్‌ను బస్ డ్రైవర్, తోటి ప్రయాణికులు అభినందించారు.
అభినందించిన మంత్రి, ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సులో మహిళకు ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజ, సాయం చేసిన తోటి మహిళా ప్రయాణికులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Praphakar) అభినందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) సైతం వీరిపై ప్రశంసలు కురిపించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం సహా సేవా భావాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం#TGSRTC బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. #Hyderabad ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్… pic.twitter.com/7ISJM8fDJ5
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 5, 2024