Weather Updates: చిరుజల్లులతో ఉపశమనం - ఏపీ, తెలంగాణలో స్వల్పంగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు !
Temperature In Andhra Pradesh: చిరు జల్లులు పడటంతో కొన్ని జిల్లాల్లో ఎండల నుంచి ఉపశమనం లభించనుండగా.. మరికొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Updates In Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో మరోసారి వాతావరణం చల్లగా మారింది. చిరు జల్లులు పడటంతో కొన్ని జిల్లాల్లో ఎండల నుంచి ఉపశమనం లభించనుండగా.. మరికొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. పగటి వేళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. కొన్ని రోజుల్లో రికార్డు స్థాయిలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం చల్లగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 40 తాకిన పగటి ఉష్ణోగ్రత నేడు దిగొచ్చింది. అత్యధికంగా జంగమేశ్వరపురంలో 36.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత, తేమ ప్రభావం తగ్గడంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉక్కపోత అధికం కానుంది. అమరావతిలో 35.8 డిగ్రీలు, కావలిలో 36.2 డిగ్రీలు, నెల్లూరులో 36.2 డిగ్రీలు, గన్నవరంలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు. అత్యధికంగా కర్నూలులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 39.1, నంద్యాలలో 39.2 డిగ్రీలు, తిరుపతిలో 38.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Daily weather report for Andhra Pradesh dated 27.03.2022 pic.twitter.com/2D1jUTasU8
— MC Amaravati (@AmaravatiMc) March 27, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
చిరుజల్లులు పడటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. నేడు సైతం ఎండల నుంచి హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం కలగనుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యధికంగా మహబూబ్ నగర్‌లో 39 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 38.6 డిగ్రీలు, దుండిగల్ లో 38.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.