Condolence to Chandramohan Death: సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్తమయం - తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
Condolence to Chandramohan Death: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Chandramohan Death: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) (Chandramohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ (KCR), జగన్ (Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులుగా ఎదిగారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని చెప్పారు.
'ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర'
'తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకున్న చంద్రమోహన్, తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం
చంద్రమోహన్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. వందలాది సినిమాల్లో నటించిన చంద్రమోహన్ విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
లోకేశ్ సంతాపం
చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ' చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని ట్వీట్ చేశారు.
సీనియర్ నటులు చంద్రమోహన్ గారి మృతి బాధాకరం. హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల… pic.twitter.com/ilKNoPhAfE
— Lokesh Nara (@naralokesh) November 11, 2023
ప్రముఖ నేతల సంతాపం
చంద్రమోహన్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. అప్పటి చిత్రాలు మొదలుకొని నిన్న, మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన చంద్రమోహన్ తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారని అన్నారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. చంద్రమోహన్ ఇక లేరనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్ జీవితం యువ నటీనటులకు ఆదర్శమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ అని తెలిపారు. చంద్రమోహన్ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
సోమవారం అంత్యక్రియలు
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి చంద్రమోహన్ పార్థివ దేహాన్ని తరలించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు.
Also Read: Chandra Mohan Death: శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే