తెలంగాణలో 3 కోట్లకు చేరిన ఓటర్లు, 71 శాతం వారే - 5 ఏళ్లలో పెరిగింది ఎంతంటే!
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలవుతుంది. తెలంగాణలో ఆ హడావిడి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ కసరత్తులు మొదలు పెట్టేశాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ కసరత్తులు మొదలు పెట్టేశాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తెలంగాణలో గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ని ఈసారి ఎలాగైనా కిందకి దించాలని మిగిలిన కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు ఎన్నికల కసరత్తు జరుగుతుంటే, మరోవైపు కీలకమైన ఓటర్ల నమోదు వేగం పుంజుకోనుంది. తెలంగాణలో ఓట్లు సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేళ్ల కాలంలో దాదాపు ఇరవై లక్షల మంది ఓటర్లు పెరిగారు.
2018 పాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే జనవరి 2023 నాటికి ఓటర్లు 2.99 కోట్లకు చేరుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. తాజాగా మహిళ ఓటర్లు, యువ ఓటర్లు గణనీయంగా పెరిగారు. మొత్తం ఓటర్లలో 71 శాతం అంటే దాదాపుగా 2.12 కోట్ల మంది మహిళలు, యువత ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షల ఓటర్లు 18, 19 ఏళ్ల వారు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 6.84 లక్షల మందిని కొత్త ఓటర్లు చేరగా, పాత ఓటర్లలో 2.72 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ పేర్కొంది.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అదనపు అవకాశాన్ని కల్పిస్తోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఓటర్ల జాబితాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆ తరువాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 4 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి (6,44,072 ఓటర్లు) నియోజకవర్గంలో ఉండగా.. అతి తక్కువ ఓటర్లు భద్రాచలం (1,42,813) నియోజకవర్గంలో ఉన్నారు.
ఓవరాల్‌గా తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా..
2023 జనవరి వరకు రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 99 లక్షల 77 వేల 6 వందల 59 మంది (2,99,77,659) ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1 కోటి 50 లక్షల 50 వేల 4 వందల 64 మంది (1,50,50,464) కాగా, మహిళా ఓటర్లు 1 కోటి 49 లక్షల 25 వేల 243 మంది (1,49,25,243) ఉన్నారు. యువ ఓటర్లలో పురుషులు 64 లక్షల 89 వేల 5 వందల 2 (64,89,502 మంది) కాగా, యువ ఓటర్లలో మహిళలు 63 లక్షల 93 వేల 7 వందల 3 (63,93,703 మంది) ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు 1 కోటి 28 లక్షల 83 వేల 2 వందల 5 (1,28,83,205) మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
2023 జనవరి నాటికి అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఏవంటే..
1. శేరిలింగంపల్లి- 6,44.072
2. కుత్బుల్లాపూర్- 6,12,700
3.మేడ్చల్- 5,53,785
4. ఎల్బీనగర్- 5,34,742
5. రాజేంద్రనగర్- 4,97,937
అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు
1. భద్రాచలం- 1,42,813
2.అశ్వారావుపేట- 1,49,322
3. బెల్లంపల్లి- 1,61,249
4.చెన్నూరు- 1,76,455
5.బాన్సువాడ- 1,82,492