Transport Officers Pendown: ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై దాడి - రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల పెన్ డౌన్
Telangana News: హైదరాబాద్ జేటీసీపై గురువారం జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం రవాణా శాఖ అధికారులు పెన్ డౌన్ పాటించారు. చివరకు కమిషనర్‌తో చర్చల అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Transport Officers Pendown In Telangana: తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు శుక్రవారం పెన్ డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్‌పై దాడికి నిరసనగా సేవలు బంద్ చేశారు. హైదరాబాద్ జేటీసీపై ఆటో యూనియన్ నేత ఒకరు దాడికి పాల్పడగా.. అందుకు నిరసనగా పెన్ డౌన్ పాటించారు. అయితే, రవాణా శాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం పెన్ డౌన్ ఆలోచన విరమించుకున్నామని..నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. జేటీసీపై దాడికి పాల్పడిన నిందితునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది
హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సీ.రమేశ్‌పై ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహ్మద్ అమానుల్లాఖాన్ గురువారం దాడికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని జేటీసీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన.. ఆటోలకు మీటర్లు బిగించాలని కోరాడు. ఇంకా పలు సమస్యలపై జేటీసీతో చర్చించి వినతి పత్రం ఇచ్చాడు. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని జేటీసీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అమానుల్లాఖాన్.. జేటీసీ దగ్గరకు వెళ్లి చెంపపై కొట్టాడు. దీంతో షాకైన జేటీసీ సహాయం కోసం అరవగా.. సిబ్బంది లోపలికి వచ్చి అమానుల్లాఖాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జేటీసీ ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దాడిని ఖండించిన మంత్రి
అటు, జేటీసీపై దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని.. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు, ఆర్టీఏ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు సైతం దాడిని ఖండించాయి. నిందితునిపై చర్యలు తీసుకోవాలని.. గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ఖైరతాబాద్ ఆర్డీవో పురుషోత్తంరెడ్డి, నాగోల్ ఆర్డీవో రవీందర్ కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

