Revanthreddy Convoy: కాన్వాయ్ వద్దని వారించిన రేవంత్ రెడ్డి - కారణం ఏంటంటే.?
Revanthreddy: ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్ ఏర్పాటు చేయగా, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదని కాన్వాయ్ వద్దని ఆయన వారించారు.
Revanthreddy Said no to Official Convoy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని (Revanthreddy) కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన తర్వాత ఆయన ఢిల్లీ (Delhi) వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి (Begumpet Airport) చేరుకున్నారు. ఈ క్రమంలో డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోసం అధికారిక కాన్వాయ్ (వాహన శ్రేణి) ను సిద్ధం చేయగా ఆయన వారించారు. తాను ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదని, తనకు ప్రత్యేక కాన్వాయ్ వద్దంటూ అధికారులకు తెలిపారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలోనే అక్కడి నుంచి బయలుదేరారు. అయితే, భద్రతా కారణాల రీత్యా కాన్వాయ్ ను ఏర్పాటు చేయడం తమ బాధ్యత అని, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఆ వాహన శ్రేణితో పాటు రేవంత్ వాహనాన్ని అనుసరించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు బస చేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు వెళ్లి వారితో సమావేశమయ్యారు.