Telangana News: సడెన్ హార్ట్ ఎటాక్స్‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం - బడి విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ
Telangana News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
Telangana News: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ముఖ్యంగా యువకులు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ, చదువుకుంటూ, స్నానం చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గుండెపోటు, హార్ట్ ఎటాక్ అని టైప్ చూస్తే వేలల్లో ఇలాంటి వీడియోలు దర్శనం ఇస్తాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు బడుల విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏదో మొక్కుబడిగా కాకుండా క్షేత్రస్థాయిలో పిల్లలంతా సీపీఆర్ చేసే విధంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ దిశగానే ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ప్రాథమిక వైద్యం అనే ప్రత్యేక సబ్జెక్టు
ప్రాథమిక వైద్యం అనే సబ్జెక్టు పెట్టి మరీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు సీపీఆర్ పై శిక్షణ ఇస్తారు. పూర్తిగా గుండెపోటు, సీపీఆర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తారు. ఇదుకోసం ప్రైవేటు బడుల్లో వారానికి రెండు, మూడు రోజులు ఒక పీరియడ్ ఇందుకు కేటాయించాలని భావిస్తోంది. కేవలం సీపీఆర్ మాత్రమే కాకుండా అత్యవసర సమయాల్లో ఎలాంటి జబ్బులకు ఎలాంటి చికిత్స అందజేయాలని, మనుషుల ప్రాణాలను ఎలా కాపాడవచ్చనే విషయాలను వివరించబోతున్నారు. ఉదాహరణకు వరికైనా రోడ్డు ప్రమాదం జరిగితే రక్తం పోకుండా ఎలా ఆపాలి, వైద్య సహాయం అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి వంటి వాటిని గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
బడుల్లోనే కాకుండా కార్యాలయాల్లోనూ శిక్షణ
అలాగే సీపీఆర్ చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న కొంత మందిని అయినా కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. గుండెలో నుంచి రక్తం సరఫరా చేసే రక్తనాళాళు బ్లాక్ అవ్వడం వల్ల గుండెపోటు వస్తుంది. ఇలాంటి సమయంలో సీపీఆర్ చేయడం వల్ల రక్త సరఫరా స్పీడ్ పెరిగి బ్లాక్ క్లియర్ అవుతుంది. ఇలా మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు. ఇదే విషయాన్ని విద్యార్థులకు కూడా వివరించి సీపీఆర్ ఎలా చేయాలో ప్రత్యేకంగా నేర్పిస్తారు. కేవలం బడుల్లోనే కాకుండా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో, రవాణా వ్యవస్థల్లో, జనావాస ప్రాంతాల్లో దీని గురించి అవగాహన కల్పిస్తూ... కార్యక్రమాలు చేయాల్సని అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గుండెపోటు లక్షణాలు ఇవే.. గుర్తిస్తే సమస్య తీరినట్లే
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.