Telangana Inter Board: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, నిమిషం నిబంధన సడలింపు
TS Inter Board Exams 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనను సడలిస్తూ 5 నిమిషాల వరకు ఎగ్జామ్ సెంటర్ చేరుకునేందుకు అవకాశం ఇచ్చింది
one minute relaxation Telangana Inter Exams: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డ్ పరీక్షల (TS Inter Board Exams)కు హాజరవుతున్న ఇంటర్ విద్యార్థులకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న నిమిషం నిబంధనను కాస్త సడలించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లో అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలతో స్పందించిన ఇంటర్ బోర్డు నిమిషం నిబంధనను సడలిస్తూ.. ఐదు నిమిషాల వరకు ఊరట కలిగిస్తున్నట్లు వెల్లడించింది.
ఎగ్జామ్ సెంటర్లకు త్వరగా చేరుకోండి
సాధ్యమైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ సూచించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు ఎగ్జామ్ సెంటర్ చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పింది. ఇప్పటివరకూ ఉదయం 9 నిమిషాల తరువాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రం లోనికి అనుమతించడం లేదు. అయితే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి 5 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. సమయానికి చేరుకోలేని విద్యార్థులు ఈ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ లోపు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు శుక్రవారం (మార్చి 1న) ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులను 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ వరకు అనుమతించాలని ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఇంటర్ విద్యా మండలి అధికారులు, ఇంటర్ బోర్డ్ అధికారులు సూచించారు.
విద్యార్థి సంఘాల రిక్వెస్ట్
ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాలు బోర్డును కోరారు. నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించాయి. తెలిసీ తెలియని కౌమారదశలో చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఏడాదంతా కష్టపడి చదివి నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోతే వారు ఏ కఠిన నిర్ణయం తీసుకుంటారోనని.. ఇంటర్ బోర్డు దీనిపై పునరాలోచించాలని కోరగా.. 5 నిమిషాల వరకు ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థి ప్రాణం తీసిన నిమిషం నిబంధన
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఓ విద్యార్థి నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి గురువారం సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు యువకుడు తన తండ్రికి రాసిన సుసైడ్ నోట్ అందరి కంట కన్నీరు తెప్పిస్తోంది.' నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా'.. అంటూ శివకుమార్ రాసిన సూసైడ్ నోట్ చూసి అందరి హృదయాలు ద్రవించాయి.
ఆదిలాబాద్‌లోని సాత్నాల బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న టేకం శివకుమార్‌కు....కలెక్టర్ బంగ్లా సమీపంలో ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోఇంటర్ సెంటర్ పడింది. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా...తొలిరోజే శివకుమార్ 3 నిమిషాల ఆలస్యంగా సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉండటంతో అప్పటికే పరీక్షా కేంద్రం గేట్లకు తాళాలు వేశారు. ఎంత బ్రతిమాలినా ప్రిన్సిపల్ విద్యార్థిని లోనికి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన టేకం శివకుమార్ సూసైడ్ నోట్ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని సాత్నాల ప్రాజెక్టు నుంచి గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు బయటకు తీయించారు. పెద్దచదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని భావిస్తే..ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంపై తల్లిదండ్రులు భోరున విలపించారు.