High Court: ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
Telangana News: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలతో 106 మంది సెర్ప్ ఉద్యోగులపై ఈసీ వేటు వేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వారిపై సస్పెన్షన్ ఎత్తేసింది.
Telangana High Court Lifet Suspension On 106 Employees: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలతో సిద్దిపేటకు చెందిన 106 మంది ఐకేపీ, డీఆర్డీఏ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురి కాగా వారికి తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఈసీ విధించిన సస్పెన్షన్ ను ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేయగా.. అందరినీ తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారనే అభియోగాలతో ఈసీ ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్ ఒకే రోజు 106 మందిపై సస్పెన్షన్ వేటు వేయగా.. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈసీ నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ జరిగింది
ఈ నెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే, ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో కలెక్టర్ మను చౌదరి ఆ ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు చేపట్టారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా.. వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా ఊరట లభించింది.
Also Read: KTR Tweet: కాంగ్రెస్‌ది కపట నీతికి గుణపాఠం చెప్పాల్సిన సమయం: కేటీఆర్