TS High Court: అమ్మమ్మ, నానమ్మ, తాతల ప్రేమ పిల్లలకు అవసరం: తెలంగాణ హైకోర్టు
TS High Court: చిన్న పిల్లలకు అమ్మమ్మ, నానమ్మ తాతల ప్రేమ అవసరం అని తెలంగాణ హైకోర్టు తెలిపింది. పెద్దల మధ్య గొడవల కారణంగా పిల్లలను వారితో కలవనీయకుండా చేయడం సరికాదనిచెప్పింది.
TS High Court: సింగిల్ పేరెంట్ పర్యవేక్షణలో ఉన్న పిల్లలకు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ, ఆప్యాయత చాలా అవసరం అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పెద్దల మధ్య గొడవల కారణంగా పిల్లలను వారితో కలవనీయకుండా చేయడం సరికాదని వెల్లడించింది. పిల్లల సంక్షేమం అంటే ఆర్థిక శ్రేయస్సు మాత్రమే కాదని.. ఇందుకు సంబంధించిన భిన్న కోణాలను చూడాలని పేర్కొంది. కుమార్తె చనిపోవడంతో నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డను మాకు చూపించడం లేదని ఓ వృద్ధ జంట కోర్టును ఆశ్రయించింది. మనవరాలిని చూడటానికి కింది కోర్టు నిరాకరించడంతో వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టి కీలక తీర్పు వెలువరించారు. మనవరాలిని న్యాయమూర్తి పిలిపించి మాట్లాడిన తర్వాత పాప భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని అమ్మను కలవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థికంగా బాగుంటే సరిపోదు - అమ్మమ్మ, తాతల ప్రేమా అవసరమే!
పిల్లల పెంపకం విషయంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కీలక పాత్ర పోషిస్తారని న్యాయమూర్తి చెప్పారు. ఆర్థికంగా తండ్రి బాగా ఉన్నప్పటికీ అదొక్కటే సరిపోదని... మనవరాలి జీవితంలో సన్నిహితులు, బంధాలు, ఇతర జ్ఞాపకాలు అవసరం అన్నారు. తాత, అవ్వలు చెప్పే కథలు, వారు పంచే ప్రేమతో పిల్లలు పరి పూర్ణంగా ఎదుగుతారని వివరించారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలపై ద్వేషంతో పెంపకం కొనసాగితే చిన్నారి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అమ్మమ్మ ఆప్యాయత బాలిక శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ వారానికి రెండు గంటలపాటు మనవరాలిని కలిసేందుకు ఆమెకు అనుమతించారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
అంగీకారంతో కలిస్తే.. అత్యాచారం కాదు..!
పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఒడిశా హైకోర్టు తీర్పు ఇచ్చింది. సదరు మహిళ అంగీకారంతో లైంగిక సంబంధం కలిగి ఉంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేదమంది. ఇలాంటి కేసుల్లో క్రిమినల్ చట్టాన్ని నిందితులపై ఉపయోగించలేమని కోర్టు తెలిపింది. జస్టిస్ సంజీవ్ పాణిగ్రాహి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి. వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం అత్యాచారంగా భావించలేమన్నారు. అలాంటి కేసుల్లో ఐపిసి సెక్షన్ 375 కింద కేసులు రిజిస్టర్ చేయలేరని పేర్కొన్నారు. అత్యాచారం కేసులో బెయిల్‌పై విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
షరతులతో కూడిన బెయిల్
కోర్టు ముందుకు వచ్చిన కేసులో నిందితుడిగా చెప్పిన వ్యక్తి... బాధితురాలిగా చెబుతున్న మహిళకు బాగా తెలుసన్నారు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయస్తులని పోలీసు రికార్డులు చెబుతున్నాయని కోర్టు వివరించింది. అత్యాచారం జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ కూడా నిర్దారిస్తున్నాయని జస్టిస్ పాణిగ్రాహి అన్నారు. దీంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు కోర్టు ఆదేశించింది. బెయిల్ కింద ఉన్న నిందితుడు దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని ఆదేశించింది. బాధితురాలిని బెదిరించరాదని కోర్టు పేర్కొంది.