Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
HighCourt : తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైనదేనని డివిజన్ బెంచ్ తేల్చేసింది. కొంత మంది అభ్యర్థులు మాత్రం అశోక్ నగర్‌లో ఆందోళనలు చేస్తున్నారు.
Telangana Group One Exam will be held as per schedule : తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. రీ షెడ్యూల్ అవసరం లేదని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం మెయిన్స్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.
గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీ చార్జ్
మరో వైపు అశోక్ నగర్ వద్ద గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేసున్నారు. రాహుల్ గాంధీ ఫేస్ మాస్కులు ధరించి పెద్ద ఎత్తున అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అభ్యర్థులు చుట్టుపక్కల ఉన్న షాపుల్లోకి పరుగులు తీయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులందర్నీ పట్టుకుని పోలీసులు స్టేషన్ కి తరలించారు.
ఏమిటీ జీవో 29 ?
వికలాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జీవో 29ను తీసుకు వచ్చింది. జనరల్ కేటగిరీలోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్ రిజర్వుడుగానే పరిగణించాలని ఈ జీవోలో పేర్కొన్నారు. ఈ కారణంగా దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని.. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రిలిమ్స్‌లోనూ తప్పులు దొర్లాయని కొంత మంది అంటున్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముందుగా పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సోమవారం నుంచే మెయిన్స్ పరీక్షలు జరుగుతూండటతో ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ గా మారింది.
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
రాజకీయ ప్రోద్భలంతోనే ఆందోళనలు జరుగుతున్నాయా ?
రాజకీయ ప్రోద్భలంతోనే ఆందోళనలు జరుగుతన్నాయని కొంత మంది ఆరోపిస్తున్నారు. చాలా కాలం ఎదురు చూసిన తరవాత మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతోంది. ఇందు కోసం నెలల తరబడి పుస్తకాలకే పరిమితమైన వారు ఉన్నారు. అయితే కొంత మది మాత్రం.. ఇలా వాయిదాల కోసం డిమాండ్ చేస్తూండటంతో పరీక్ష కోసం ప్రిపేర్ అయిన వారు ఇబ్బందులు పడుతున్నారు.