New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు - సెక్యూరిటీలో అదొక రక్షణ దుర్గం!
భద్రతకు అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వంరక్షణ వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోకి
సరికొత్త పాలనా సౌధం సకల హంగులతో రూపుదిద్దుకుంది! ముఖ్యంగా సెక్యూరిటీ కోణంలో చూస్తే అదొక రక్షణ దుర్గం! శత్రువుకు అందని భవనం! చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత వలయం! డేగకళ్లతో పహారా కాస్తుంటారు. భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశిస్తారు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాస్తారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తివివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
ఏ ద్వారం నుంచి ఎవరు వస్తారంటే..
- సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.
- నార్త్ఈస్ట్ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్ కోసం వినియోగిస్తారు.
- సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
- తూర్పుగేట్ (మెయిన్‌గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.
- దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేశారు.
సచివాలయ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఇదే!
- ఉక్కు: 8,000 మెట్రిక్ టన్నులు
- సిమెంటు: 40,,000 మెట్రిక్ టన్నులు
- ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు)
- కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు
- ఇటుకలు: 11 లక్షలు
- ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు
- గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
- మార్బుల్: లక్ష చదరపు అడుగులు
- ధోల్ పూర్ రెడ్ స్టోన్: 3,500 ఘనపు మీటర్లు
- కలప: 7,500 ఘనపుటడుగులు
- పనిచేసిన కార్మికులు: మూడు షిప్టుల్లో 12,000 మంది
సచివాలయంలో అంతస్తుల వారీగా విభాగాల వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
2వ అంతస్తు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు: ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్
4వ అంతస్తు : ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్ మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
5వ అంతస్తు: ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు: సీఎం, సీఎస్, సిఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు
ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో సీఎంకార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు 'జనహిత' పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ పేరు పెట్టాలని ఆ రోజే నిర్ణయం
తన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణంచేసిన సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని 2022 సెప్టెంబరు 15న ఆదేశాలు జారీచేయగా, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 111, 15/09/2022) ఇచ్చారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.