Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Liquor Sales in Telangana | తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అదనపు ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖ బీరుపై రూ.20, లిక్కర్ పై రూ.20 నుంచి రూ.70 పెంచనుందని సమాచారం.
Telangana Govt planning to hike Liquor price in state soon report హైదరాబాద్: ఎక్కువ మద్యం విక్రయాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణలో మందు బాబులకు భారీ షాక్ తగలనుంది. రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కో బీరు బాటిల్ పై దాదాపు రూ.20 వరకు ధర పెరగనుంది. లిక్కర్ బాటిల్స్ పై రూ.20 నుంచి 70 రూపాయల వరకు పెంచేందుకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ కసరత్తు చేపట్టింది. కొత్తగా పెరగనున్న మద్యం ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం చేకూర్చడానికి ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రులకు, పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి అధిక ఆర్థిక వనరుగా ఉన్న మద్యంపై ఆదాయం ఆర్జించడానికి ఎక్సైజ్ శాఖ సన్నద్ధమైంది. దాంతో బీర్లు, లిక్కర్ బాటిల్ పై కనీసం రూ.20 నుంచి ధరలు పెంచడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళితే ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ఏమైనా సూచనలు చేస్తే ఎక్సైజ్ శాఖ ధరల్లో స్వల్ప మార్పులు చేర్పులు చేసిన అనంతరం తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి.
మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్
దేశంలో మద్యం విక్రయాలలో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ చేపట్టిన సర్వేలో తెలంగాణలో గత ఏడాది అత్యధిక మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో గతేడాది రాష్ట్రంలో మద్యం కోసం సగటున ఒక వ్యక్తి రూ.1,623 ఖర్చు చేశారు. ఈ జాబితాలో మరో తెలుగు రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో మద్యం కోసం ఒక వ్యక్తి సగటున రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్ లో రూ.1,245 ఖర్చు పెట్టగా, ఛత్తీస్ గఢ్ లో ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.1,227 ఖర్చు చేసినట్లు NIPFP సర్వేలో పేర్కొంది.
Also Read: KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం