Insurance for Singareni Employees: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ - రూ.1 కోటి ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Accident Insurance Scheme for Singareni employees: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకం ప్రారంబమైంది.
Rs 1 crore Accident Insurance Scheme for SCCL employees: హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సంస్థ కూడా కీలక పాత్ర పోషించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు.
7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తెలంగాణ
2014లో మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు. గత 10 ఏళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు రాష్ట్రాన్ని దివాళా తీయించిందని విమర్శించారు.
ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలను, 25వ తేదీ వరకు విడతల వారీగా చెల్లించిన ఘనుడు కేసీఆర్ అని సెటైర్లు వేశారు. తాము అధికారంలోకి వచ్చాక మొదటి నెల 4వ తేదీన, రెండో నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు బంధు మార్చి 31లోగా దశలవారీగా చెల్లిస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాలకు నిధులు ఇబ్బంది అవుతుందని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం మోసం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు.
శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు, శాసన మండలిలో కవిత, బహిరంగ సభలలో కేసీఆర్.. ఈ నలుగురి గోస తప్పా తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది లేదన్నారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేస్తే.. కోర్టు పరిధిలో ఉన్న వాటికి న్యాయ పరిష్కారం చూపించి 25 వేల ఉద్యోగులకు నియామక ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ సమస్యలను పరిష్కరించలేదని హరీష్ రావును సీఎం రేవంత్ ప్రశ్నించారు. స్టాఫ్ నర్స్, పోలీసులు నియమాకాలు పూర్తి చేసినట్లు తెలిపారు.
43 వేల మంది కార్మికులకు లబ్ది: భట్టి విక్రమార్క
43 వేల మంది కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా పథకం అమలు చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు మొత్తంగా రూ.1.20 కోట్ల పరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉందని, ఇప్పుడు సింగరేణి కార్మికులకు అంత మొత్తంలో ప్రమాద బీమా అమలు చేస్తున్నామని సింగరేణి ఎండీ బలరామ్ అన్నారు. పెద్ద మొత్తంలో సింగరేణి కార్మికులకు బీమా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.